అంబటి మురళీకృష్ణ అనే బాపట్ల నేత టీడీపీలో చేరారు. ఆయన వైసీపీ ఏర్పాటు నుంచి పదవులు ఆశించకుండా పార్టీకి పని చేస్తున్నారు. అంబటి రాంబాబుకు బంధువు కూడా. ఆయన తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరిపోయారు. బొత్స నియోజకవర్గం చీపురుపల్లిలో ప్రతీ రోజూ నేతలు ఆపార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. రాజంపేట నియోజకవకర్గం నుంచి వందల మంది వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీలో చేరారు. విశాఖలో సీతంరాజు సుధాకర్ అనే మాజీ వైసీపీ నేత… మెజార్టీ కార్పొరేటర్లతో టీడీపీలో చేరిపోయారు. ఇవన్నీ బయటకు తెలిసిన… మీడియాలో ప్రచారం అవుతున్న చేరికలు. కానీ గ్రామ, మండల స్థాయిలో టీడీపీలోకి చేరికలు ఊహించనంతగా సాగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతి రోజూ చేరికల కార్యక్రమం పెట్టుకుంటున్నారు. చంద్రబాబు వద్ద నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల వరకూ ప్రతీ రోజూ చేరికలతో బిజీగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు.. వైసీపీలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ టీడీపీలోకి వచ్చి చేరిపోతున్నారు. వైసీపీ నేతగా గుర్తింపు ఉండటం కన్నా.. టీడీపీలో చేరిపోవడం మంచిదన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం మారడం ఖాయమని తర్వాత ఇబ్బందులు పడటం కంటే ఇప్పుడే సర్దుకోవడం మంచిదన్నట్లుగా ఉన్నారు.
ఈ చేరికల జోరు చూసి టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎన్నికలసమయంలో చేరికలు ఉంటాయి. కానీ నియోజకవర్గ స్థాయి నేతలు చేరితే వారితో పాటు దిగువ స్థాయి నేతలు వచ్చి చేరుతారు. కానీ ఇక్కడ నియోజకవర్గ స్థాయి నేతలు లేకుండా క్యాడరే వచ్చి చేరుతున్నారు. ప్రజాభిప్రాయానికి ఇది సంకేతంలా కనిపిస్తోందన్న చర్చ ప్రారంభమైంది. నిజానికి పార్టీ మారే వారందర్నీ బుజ్జగించడానికి .. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ చేరికలతో ప్రజల మూడ్ తెలిసిపోతోందని వైసీపీ నేతలు కూడా.. ఊరుకున్నంత ఉత్తమం అని.. పార్టీ మారలేని వారు సైలెంట్ అవుతున్నారు.