ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితే కీలక సూత్రధారుల్లో, పాత్రధారుల్లో ఒకరని సీబీఐ సంచలన ఆరోపణ చేసింది. సౌత్ లాబీలో ఆమె కీలక వ్యక్తి అని, ఇండో స్పిరీట్ లో తనకు ఏకంగా 33శాతం వాటా ఉందని కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కోర్టులో హజరుపర్చింది.
ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై సీబీఐ సంచలన ఆరోపణలు చేస్తూ, తనను 5రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఈ స్కామ్ లో కవిత కూడా కింగ్ పిన్ అని మరోసారి ఆరోపించింది.
కవిత సీఎ బుచ్చిబాబు చాటింగ్ లో ఇందుకు సంబంధించిన విషయాలు ఉన్నాయని, ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు సీబీఐ వాదించింది. విజయ్ నాయర్ ద్వారా, అరుణ్ పిళ్ళై , బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లితో కవిత కథ నడిపారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కవిత ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారన్నారు.ఇండో స్పిరీట్ లో కవిత తన బినామీల ద్వారా ఆమె భాగస్వామి అని వాదించారు.
మాగుంట రాఘవ ద్వారా ఇండో స్పిరిట్ కంపెనీని ఎన్.వో. సీ కోసం కవిత ప్రయత్నించారని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. జోన్ 5కు 5 కోట్ల చొప్పున 5 జోన్లకు 25కోట్లు ఇవ్వాలని కవిత ఆదేశించారన్నారు. ఈ విషయంలో ఆలస్యం చేసినందుకు కవిత బెదిరించారని..హైదరాబాద్ లో ఉన్న మీ వ్యాపారాలు ఇబ్బందిపడతాయని బెదిరించినట్లు సీబీఐ ఆరోపించింది.
ఇక సీబీఐ అరెస్ట్ పై కవిత తరఫు లాయర్లు మెమో దాఖలు చేశామని, ఆ అరెస్ట్ సరైంది కాదు అని కవిత లాయర్లు వాదించగా… తన అనుమతితోనే సీబీఐ అరెస్ట్ జరిగిందని, కోర్టును ప్రశ్నించకండి అంటూ న్యాయమూర్తి సుతిమెత్తగానే హెచ్చరించారు.
ఇక, సీబీఐ అరెస్ట్ పై రాత్రి 10.30గంటలకు తనకు సమాచారం ఇచ్చారని… దీనిపై లీగల్ ఓపీనియన్ కావాలని అడిగినా సహకరించలేదని ఎమ్మెల్సీ కవిత కోర్టుకు తెలిపారు. కస్టడీపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.