తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును మార్చే అవకాశం ఉందా..? కూటమి నేతలంతా ఆరణి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో అభ్యర్థి మార్పుపై జనసేనాని కసరత్తు ప్రారంభించారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
కూటమి అభ్యర్థుల్లో 5 సీట్లు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. తాజగా చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, నారా లోకేష్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐదు సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చిస్తారని.. అందులో భాగంగా తిరుపతి అభ్యర్థి మార్పుపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన ఆరణి శ్రీనివాసులు పెద్దగా ఎవరికీ తెలియదు. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడాన్ని మొదటి నుంచి కూడా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికుల్లో ఎవరికీ టికెట్ ఇచ్చినా కలిసి కలిసి పని చేస్తామని చెప్తుండటంతో…జనసేనానిపై స్థానిక నేతల ఒత్తిడి ఫలించనుందా అనే చర్చ జరుగుతోంది. తిరుపతి కూటమి నేతల ఫీడ్ బ్యాక్ మేరకు స్థానికులకు అవకాశం ఇవ్వాలని పవన్ నిర్ణయం తీసుకోనున్నారని..ఈ మేరకు కిరణ్ రాయల్ పేరు పరిశీలనలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కిరణ్ రాయల్ కు గెలుపు అవకాశం ఉంటుందని..ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ కు మొదటి నుంచి కిరణ్ రాయల్ ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నారు. ఇటీవల పోతిన మహేష్ పవన్ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలకు కిరణ్ రాయల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గత కొన్నాళ్ళుగా పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్న కిరణ్ ను తిరుపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని జనసేన వర్గాల భోగట్టా.