ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని లోకేష్ కు సూచించింది.
లోకేష్ ఫోన్ ట్యాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.పెగాసస్ సాఫ్ట్ వేర్ సహాయంతో లోకేష్ ఫోన్ చేసినట్లుగా ఐఫోన్ సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు.
లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నించిందని ఆపిల్ సంస్థ అలర్ట్ ఇవ్వడంతో… ఈ పని ఎవరు చేసి ఉంటారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వైసీపీ నేతలే లోకేష్ ఫోన్ టార్గెట్ చేసి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన ఐటీ విభాగానికి లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేయాలన్న ఆదేశాలు వెళ్లి ఉంటాయన్న అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలువురు వైసీపీ అసంతృప్త నేతలతో భేటీ అవుతూ.. వారిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రజా గళం సభలతో చంద్రబాబు బిజీ కావడంతో పార్టీ వ్యవహారాలను లోకేష్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు బదులుగా లోకేష్ ను టార్గెట్ చేసి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దీనిపై విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ టార్గెట్ గా వైసీపీనే ఈ దుశ్చర్యకు తెరలేపి ఉండొచ్చునని.. దాంతో ఈ డిమాండ్లును డీజీపీ, ఇంటలిజెన్స్ విభాగం తేలిగ్గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు టీడీపీ మద్దతుదారులు.