వరంగల్ ఎంపీగా కడియం కూతురు కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు కేసీఆర్. కానీ, వారిద్దరూ కాంగ్రెస్ గూటికి చేరటం, కావ్య కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించాక పార్టీ మారటంతో షాక్ తిన్న గులాబీ దళం… క్యాండిడేట్ కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఉమ్మడి వరంగల్ లో కడియంకు పేరు, పలుకుబడి ఉంది. అందుకు తగ్గ క్యాండిడేట్ కోసం వెతుకుతున్న తరుణంలో హరీష్ రావు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. హరీష్ రావుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి తోడవటంతో వరంగల్ నుండి రాజయ్యకు టికెట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
నిజానికి రాజయ్య ఎన్నికలయ్యాక పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుండి అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అటు వైపు కడియం ఫ్యామిలీ కాబట్టి రాజయ్యకు అవకాశం ఇస్తారు అని అంతా అనుకున్నారు. పైగా రాజయ్య అభ్యర్థిగా ఉంటే మందకృష్ణ మాదిగ సపోర్ట్ కూడా ఉంటుందని ఒత్తిడి కూడా తెచ్చారు. కానీ, రాజయ్యపై అవినీతి ఆరోపణలతో పాటు లైంగిక ఆరోపణలు అనేకం. దాంతో కాంగ్రెస్ ఆయన చేరికను వాయిదా వేస్తూ రాగా… ఈలోపు కడియం ఫ్యామిలీయే కాంగ్రెస్ గూటికి చేరింది. దీంతో రాజయ్య ఏ పార్టీలోనూ చేరకుండా ఉండిపోయారు.
రాజయ్యకు, కడియం ఉన్న వైరం దృష్ట్యా రాజయ్యకు టికెట్ ఇవ్వాలన్న హరీష్ రావు, పల్లా ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గినట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్ స్వయంగా రాజయ్యకు ఫోన్ చేసి పిలిచినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నేతలతో మీటింగ్ లో రాజయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.