పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసి బహింగసభలో మాట్లాడనున్నారు. పులివెందులలో రాజకీయాల్ని పూర్తిగా అవినాష్ రెడ్డి తో కలిసి శివశంకర్ రెడ్డి చూసుకునేవారు. ప్రస్తుతం ఆయన వివేకా హత్య కేసులో బెయిల్ షరతుల కారణంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కానీ ఫోన్ల ద్వారా.. వీడియో కాల్స్ ద్వారా రాజకీయం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే పులివెందుల నుంచే సునీత లేదా ఆమె తల్లి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కూడా. షర్మిల చేస్తున్న ప్రచారం మహిళల మనసుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇతరుల్లోనూ… హంతకుడికి ఓటు ఎందుకు వేయాలన్న అభిప్రాయం కలిగించేలా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా జగన్.. భారతికి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
గతంలోనూ ఆమె పులివెందులలో ప్రచారం చేశారు. కానీ ఈ సారి మాత్రం రాజకీయ వ్యవహారాలు కూడా చూసుకోనున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చే్సతున్న అవినాష్ రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంటుంది. చెల్లెళ్లు చేస్తున్న పోరాటాన్ని కూడా మరిపించేలా..జగన్ గత మెజార్టీని పెంచేలా భారతి ప్రచారం చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.