ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత సత్తా ఉందో ముందే ఊహించడం కష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్యపరుస్తున్నాయి. అందుకే తమ సినిమాలకు వంద కోట్లు, రూ.50 కోట్లు రావాలని కోరుకోవడం పెద్ద విచిత్రమేం కాదు. కాకపోతే.. ఆల్రెడీ విడుదలై, ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్న సినిమా రూ.50 కోట్లు కొట్టాలని కలకనడం… అత్యాసే.
కోన వెంకట్ నిర్మాతగా రూపొందిన సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలికి ఇది 50 సినిమా. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. రివ్యూలన్నీ ఈ సినిమాకి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాయి. వసూళ్లూ అంతంత మాత్రమే. అయితే ఈ సినిమా అంజలి కోసమైనా రూ.50 కోట్లు కొట్లాలని నిర్మాతగా కోన వెంకట్ ఆశ పడుతున్నారు. ఎందుకంటే ఇది అంజలికి 50వ సినిమా. సెంటిమెంట్ గా రూ.50 కోట్లు వస్తే అంకెలు మ్యాచ్ అవుతాయన్నది కోన.. భావన. మౌత్ టాక్ బాగానే ఉన్నా గురువారం థియేటర్లో ప్రేక్షకులు కనిపించలేదు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా పెట్టుబడి తిరిగి వస్తే అదే పది వేలు.. కోన లెక్కల్లో రూ.50 కోట్లు.