గుంటూరులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభ పెట్టి పాత క్యాసెట్ ను తిరగేస్తున్న సమయంలో .. గుంటూరు జడ్పీ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా వేమూరులో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. కరుడు గట్టిన క్రిస్టియన్ అయిన క్రిస్టినా .. తన భర్తతో కలిసి పార్టీ మారిపోవడం ఆశ్చర్యకరంగా మారింది. 2014లో తాడికొండ నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. 2019లో టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేశారు. మళ్లీ టిక్కెట్ ఇస్తామని చెప్పి తాడికొండకు ఇంచార్జ్ గా నియమించి ఖర్చు పెట్టుకున్న తర్వాత టిక్కెట్ నిరాకరించి సుచరితకు ఇచ్చారు.
అయితే ఈ మాత్రం దానికే వారు పార్టీ మారిపోతారా అంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే చాన్సే లేదని అర్థం కావడంతో జడ్పీ చైర్ పర్సన్ పదవిని కాపాడుకోవడం కోసం ఆమె ముందుగానే పార్టీ మరిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఆమె కుల సర్టిఫికెట్ పై చాలా వివాదాలున్నాయి. అలాగే ముగ్గురు పిల్లల అంశం కూడా విచారణలో ఉంది. ఏ విధంగా చూసినా ఆమె పదవికి అనర్హురాలు అని తేల్చడం ఒక్క రోజులో పని. అసలు వైసీపీలో టిక్కెట్టే రాలేదు.. టీడీపీ వస్తే మొదటికే మోసం వస్తుందని .. ఆ పార్టీలో చేరిపోయారు.
ఇలా వైసీపీ రాదని..టీడీపీ వస్తుందని.. పదవుల్ని కాపాడుకుందామన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున నేతలు వైసీపీను వీడి టీడీపీలో చేరుతున్నారు. ఇందులో పంచాయతీ వార్డు మెంబర్లు .. వారి అనుచరుల దగ్గర్నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకూ ఉంటున్నారు. ఎంత ఆపుదామని ప్రయత్నించినా.. ఏపీలో వైసీపీ కి ఓటమి ఖాయమన్న అభిప్రాయంతో ఎవరూ ఆగడం లేదు. కట్టలు తెంచుకున్నట్టుగా పోలోమని టీడీపీలో చేరిపోతున్నారు.