ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల్లోనూ గరిష్టంగా పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలతో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయించుకుంటోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోసం రెండు రోజులు కోయంబత్తూరులో లోకేష్ ప్రచారం చేశారు. తాజాగా ఆయనకు తేజస్వీ సూర్య నుంచి కూడా ఆహ్వానం అందింది. బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీలో యువనేతగా మంచి గుర్తింపు పొందారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న బెంగళూరు సౌత్ లో లోకేష్ ప్రచారం కలసి వస్తుందని నమ్ముతున్నారు. త్వరలో ప్రచార తేదీలను ఖరారు చేయనున్నారు.
కర్ణాటకలో పవన్ కల్యాణ్ తోనూ ప్రచారం చేయించుకోవాలని బీజేపీ నిర్ణయించుకుంది. బెంగళూరు సిటీలో కాకుండా.. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పవన్ తో ప్రచారం చేయించుకునేందుకు బీజేపీ ప్రణాళిక రెడీ చేసుకుంది. కర్ణాటకలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు, మూడో విడతల్లో ఎన్నికలు పూర్తయిపోతాయి. ఆ తర్వాత నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అందుకే ముందుగా వారితో ప్రచారం చేయించుకోవాలనుకుంటున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రచారానికి పవన్ రెండు రోజుల సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
కర్ణాటక తమిళనాడుల్లో పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడి నేతలు కూడా ఏపీకి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. తమిళ ఓటర్ల ప్రభావం ఉన్న నగరి వంటి చోట్ల.. అన్నామలైతో ప్రచారం చేయిస్తే.. ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ కంటే ముందుగానే తమిళనాడు, కర్ణాటక ఎన్నికలు ముగినుండటంతో అక్కడ ప్రచారానికి టీడీపీ, జనసేన నేతలు కొంత సమయం కేటాయించాల్సి వస్తోంది.