చిరంజీవి నటించిన సినిమాల్ని సీక్వెల్‌గా తీస్తే..? అనే ప్రశ్న వచ్చినప్పుడుల్లా ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’ గుర్తొస్తుంది. సీక్వెల్ కి తగిన కథ ఇది. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చేస్తే ఈ సినిమాకి మరింత మైలేజీ వస్తుంది. చిరు ఆశ కూడా అదే. ఆయన చాలా సందర్భాల్లో ఈ సీక్వెల్ గురించి ప్రస్తావించారు. జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే అది ఈ సీక్వెల్ తోనే అన్నంత ప్రచారం జరిగింది. కానీ.. జాన్వీ ఎంట్రీ `దేవర`తో అయిపోయింది. చరణ్‌తో కలిసి నటించాలన్న ఆశ.. బుచ్చిబాబు సినిమాతో తీరిపోయింది. దాంతో ‘జగదేక వీరుడు..’ సీక్వెల్ పై ఆశలు సన్నగిల్లాయి.
అయితే తాజాగా చిరంజీవి కామెంట్స్ తో ఈ సినిమాపై మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. `జగదేక వీరుడు అతిలోక సుందరి` సీక్వెల్ గా రావాలి, అందులో చరణ్, జాన్వీ కలిసి నటించాలి అంటూ తన మనోగతాన్ని చిరంజీవి బల్లగుద్దినట్టు చెప్పారు. ఈ సీక్వెల్ చూడాలన్నది తన కల అని మరోసారి తన మనోగతాన్ని ఆవిష్కరించారు. చిరు అనుకొంటే కొదవేముంది? పైగా నేటి తరం దర్శకులు ఎలాంటి కథనైనా డీల్ చేయగల సమర్థలు. `జగదేక వీరుడు – అతిలోక సుందరి` లాంటి కథలకు సీక్వెలే రావాల్సిన పనిలేదు. రీమేక్ చేసినా చాలు. ఇప్పటి సాంకేతికతని అందిపుచ్చుకొని, సన్నివేశాలు రాసుకోగలిగితే.. తప్పకుండా అద్భుతాలు సృష్టించొచ్చు. అనిల్ రావిపూడి, వశిష్ట లాంటి యువ దర్శకులు పూనుకొంటే.. ఇదేం పెద్ద విషయం కాదు. సో… సీక్వెల్ కి తగిన కథ రెడీ చేయడం దర్శకుల చేతుల్లో ఉంది.