ఇమేజ్ కోసం నానా పాట్లు పడుతుంటారు హీరోలు. అయితే తమకంటూ ఓ ఇమేజ్ వచ్చాక దాన్ని కాపాడుకోవడం కోసం ఆపపోసాలు పడాలి. ఇమేజ్ ఛట్రం నుంచి బయటకు రావడం, మరో కొత్త ఇమేజ్ సంపాదించుకోవడం ఇదో సర్కిల్. అదెలాగో తెలీక చాలామంది తికమకపడుతుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే పరిస్థితుల్లో ఉన్నాడు.
‘పెళ్లి చూపులు’ మంచి హిట్. అప్పటికి విజయ్ కి ఎలాంటి ఇమేజూ లేదు. తనపై ఆశలూ, అంచనాలూ లేవు. కాబట్టి ముందస్తు ప్రిపరేషన్లు లేకుండా సినిమాని హాయిగా చూశారు. హిట్ చేశారు. ఆ తరవాత `అర్జున్ రెడ్డి` వచ్చింది. ‘పెళ్లి చూపులు’కీ ‘అర్జున్ రెడ్డి’కీ అస్సలు పొంతనే ఉండదు. పైగా అప్పటి వరకూ అలాంటి ఎగ్రసీవ్ క్యారెక్టర్ని తెలుగు ప్రేక్షకులు చూళ్లేదు. అందుకే దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్‌పై ఓ ఇమేజ్ ఏర్పడిపోయింది. ఇక అక్కడ్నుంచి విజయ్ కష్టాలు మొదలయ్యాయి. `అర్జున్‌రెడ్డి` హ్యాంగోవర్లో కొన్ని తప్పులు చేశాడు. ఫలితం అనుభవించాడు. ఆ క్యారెక్టర్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి చేసిన సినిమా ‘గీత గోవిందం’ ఒక్కటే హిట్టయ్యింది. లేటెస్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ సైతం డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది.
ఇమేజ్ ఏ స్థాయిలో కొంప ముంచుతుందో చెప్పడానికి విజయ్ ఓ నిదర్శనం. ఇప్పుడు విజయ్ ఏం చేయాలి? తన పాత సినిమాల్ని పూర్తిగా మర్చిపోవాలి. పూర్తిగా కొత్త తరహా కథలతో సర్ప్రైజ్ చేయాలి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఫ్లేవర్‌లో సినిమాలు చేస్తే ఫలితం ఉండదు. ఇదే సూత్రం సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టిలకు కూడా వర్తిస్తుంది. ‘డీజే టిల్లు’తో ఓ మార్క్ సెట్ చేశాడు సిద్దు. ‘టిల్లు స్క్వేర్’తో ఆ మ్యాజిక్ రిపీట్ చేశాడు. అదే పాత్ర, అదే బాడీ లాంగ్వేజ్, అదే డైలాగ్ డెలివరీ కాబట్టి `టిల్లు స్క్వేర్`తో ఇబ్బంది రాలేదు. దాన్ని పక్కన పెట్టినా సిద్దు హిట్ కొట్టగలడా? మామూలు సినిమాల్లో సిద్దుని చూడగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘జాతిరత్నాలు’తో నవీన్ పొలిశెట్టి కామెడీలో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. దాన్ని కంటిన్యూ చేయడం కూడా సాధారణమైన విషయం కాదు. ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ లో ఆ కామెడీ టైమింగ్ కాస్త తగ్గింది. దాంతో.. చావు తప్పి, కన్నులొట్టబోయిన పరిస్థితి. అనుష్క లాంటి హీరోయిన్ ఉన్నా.. అది బిలో యావరేజ్ మార్క్ దగ్గరే ఆగింది. ఇప్పుడు ఎలాంటి కథని ఎంచుకోవాలో తెలీక… పొలిశెట్టి కన్ప్యూజ్ అవుతున్నాడు. ఈమధ్య కాలంలో దాదాపు 10 కథల్ని రిజెక్ట్ చేశాడని టాక్. ఇదంతా.. వచ్చిన ఇమేజ్‌ని కాపాడుకోవడంలో పాట్లే.
ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు, కొత్త కథలతో ఆడియన్స్‌ని మాయ చేయడమే… వీళ్ల ముందున్న లక్ష్యం. అలా జరగాలంటే.. కాస్త ఎలెర్ట్ గా ఉండాలి. కొత్త ఆలోచనలకు స్వాగతం చెప్పాలి. అప్పుడే వీళ్ల కెరీర్లు బాగుంటాయి. ప్రేక్షకులకూ కొత్త సినిమాలు చూసే ఛాన్స్ దొరుకుతుంది.