తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్ల లక్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందా? రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా గెలిచేలా లేని అభ్యర్థులను మార్చబోతున్నారా…? ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ఎమర్జెన్సీ మీటింగ్ అందుకేనా?
గాంధీభవన్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఆశలున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. స్వతహాగా పదికి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉన్న తెలంగాణలో పట్టువిడవద్దు అన్న లక్ష్యంతో ఏఐసీసీ నుండి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం పోటీ చేసే అభ్యర్థులతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ఈ మీటింగ్ కు హజరుకాబోతున్నారు.
రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా ఏఐసీసీ స్వయంగా ఓ ఫ్లాష్ సర్వే చేసిందని… ఇటు సునీల్ కనుగోలు టీంతో మరో సర్వే చేయించుకున్న ఏఐసీసీ, ఆ రెండు సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలనే బరిలో ఉంచాలని, గెలిచే అవకాశం సన్నగిల్లుతున్న అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాదు టికెట్ ప్రకటించి వెనక్కి తీసుకుంటే వచ్చే అసంతృప్తులను చల్లార్చే బాధ్యతను ముందుగానే డిప్యూటీ సీఎం భట్టికి అప్పగించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ భట్టి, ఉత్తమ్ లే అసంతృప్తులను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయటంతో ఇప్పుడు కూడా వారికే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పెండింగ్ లో ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల విషయం కూడా ఈ మీటింగ్ లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది.