పార్టీలో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకే బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నారా..? బండి దూకుడు రాజకీయ నిర్ణయాలతో తాను వెనకబడిపోతున్నాననే దీక్షకు దిగుతున్నారా..? దీక్ష ఉద్దేశం బండి దూకుడుకు చెక్ పెట్టడమేనా..? ఇప్పుడివే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇటీవల కేసీఆర్ రైతు రాజకీయం ప్రారంభించగానే…బండి కూడా వెంటనే రైతు దీక్ష అంటూ స్వరం వినిపించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించే బండి సంజయ్ ఈ దీక్షను చేపట్టారా..? స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నారా..? తెలియదు. కానీ, బండి దీక్ష తర్వాత కిషన్ రెడ్డి కూడా రైతు దీక్ష చేపట్టడం చర్చనీయాంశం అవుతోంది.
బీజేపీలో కిషన్ రెడ్డి – బండి సంజయ్ ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే బండిని రాష్ట్ర అద్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారనేది బండి వర్గీయుల ఆరోపణ. కాగా…పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డికి బదులుగా బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
కిషన్ రెడ్డి రాష్ట్ర అద్యక్షుడిగా ఉండగా… బండి సంజయ్ దీక్ష చేపట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి. ప్రభుత్వంపై ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వెనకబడిపోతున్నట్లు అనుకున్నాడో మరేమిటో కానీ కిషన్ రెడ్డి కూడా దీక్షకు దిగారు. తనపై వస్తోన్న విమర్శకుల నోరు మూయించడమే కాకుండా…బండికి కౌంటర్ గా ఉంటుందని కిషన్ రెడ్డి దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.