వివేకా హత్య కేసులో సీబీఐపైనా తీవ్ర ఒత్తిడి ఉందని… హత్య జరిగిన రోజు దృశ్యాలు చూసి ఎవరైనా గుండెపోటు అనుకుంటారా అని వివేకా కూతురు వైఎస్ సునీత ప్రశ్నించారు. వివేకా కేసుకు సంబంధించిన పలు అంశాలతో మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
సీబీఐ మొదటి చార్జ్ షీట్ లో పేర్కొన్న ఏ1 ఎర్రగంగిరెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందన్నారు. ఏ3 ఉమాశంకర్ రెడ్డితోనూ సంబంధాలున్నాయి, వివేకా పీఏ కృష్ణారెడ్డికి ఉమాశంకర్ రెడ్డికి సంబంధాలున్నాయి… వారిద్దరి మధ్య కాల్స్ కూడా సాగాయి, కానీ అవినాష్ రెడ్డి మాత్రం వీరెవరో నాకు తెలియదంటూ తప్పించుకుంటున్నారని సునీత ఆరోపించారు. హత్య జరుగుతున్న సందర్భంలో అవినాష్- ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయని, అందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు వెల్లడించారు.
ఇక సునీత మేనత్త విమలారెడ్డి చేసిన విమర్శలపైనా సునీత స్పందించారు. తన అన్న చనిపోతే ఇలాగేనా మాట్లాడాల్సింది… న్యాయం కోసం మాట్లాడాల్సింది పోయి ఆడపిల్లలు ఇలా బయటకొచ్చి మాట్లాడుతారా అని ప్రశ్నిస్తున్నారు… ఆనాడు షర్మిల 3200కి.మీ పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు మాత్రమే షర్మిలను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.
హత్యకు కొన్ని రోజుల ముందు ఓ సభపై అవినాష్ పలకరిస్తున్నా వివేకా పట్టించుకోకుండా వెళ్లిపోతున్న క్లిప్పింగ్స్ ను మీడియాకు చూపించిన సునీత… అవినాష్ అంటే నచ్చకున్నా పార్టీ కోసం వివేకా పనిచేశారన్నారు.