ప్రముఖ గాయకుడు, బహుజన యుద్దనౌకగా పేరొందిన ఏపూరి సోమన్న కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న సోమన్న, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
ఎన్నికలకు ముందు వైఎస్సార్ తెలంగాణ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరే ముందు సోమన్నకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. కానీ, తుంగతుర్తి టికట్ పై హామీ ఇస్తేనే కాంగ్రెస్ లో చేరుతానన్నారు. అద్దంకి దయాకర్ లేదా డా.రవి.. ఈ ఇద్దరిలో ఒకరికి తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని అప్పట్లో భావించడంతో సోమన్న కాంగ్రెస్ ను కాదనుకున్నారు.
అధికారంలోకి వస్తే సాంస్కృతిక సారధి బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ హామీ ఇచ్చినా కాంగ్రెస్ ను కాదని కారెక్కారు. ఎన్నికల ప్రచార సభలో గజ్జెకట్టి బీఆర్ఎస్ తరఫున ఆడిపాడారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సోమన్న కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డితో సోమన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజాగా రేవంత్ సమక్షంలో కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సోమన్న కాంగ్రెస్ లో చేరడం ఆశ్చర్యపరిచింది.
సోమన్న చేరికకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా..? అని చర్చ జరుగుతోంది. అయితే, రేవంత్ ను కాదని సోమన్న కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ లేదు. నల్గొండ జిల్లా చేరికలు కోమటిరెడ్డి కనుసన్నలో జరగాలనే ఒప్పందంలో భాగంగా సోమన్న రేవంత్ కాకుండా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.