దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఆ పార్టీ భావించే వాల్తేరు క్లబ్ పై తాజాగా విజయసాయి రెడ్డి మాట్లాడటం వైసీపీని మరోసారి ఇరకాటంలోకి నెట్టేసింది. వాల్తేరు క్లబ్ ను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తూ విశాఖ వాల్తేరు క్లబ్ పై మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు.
విశాఖ వైసీపీ ఎంపీగా బొత్స సతీమణి ఝాన్సీరెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో విజయసాయి రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో తమ విజయావకాశాలు దెబ్బతింటాయని అంచనా వేసిన బొత్స వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఏదైనా ఉంటే జగన్ తో మాట్లాడాలి కానీ, ఇలా బహిరంగంగా మాట్లాడవద్దన్నారు. ఇప్పుడు వాల్తేరు క్లబ్ ఇష్యు గురించి మాట్లాడే అవసరం ఏముందని విజయసాయిని ప్రశ్నించారు. తాను, జగన్ ఉండగా వాల్తేరు క్లబ్ కు ఎలాంటి నష్టం వాటిల్లే చర్యలు జరగని స్పష్టం చేశారు.
2014ఎన్నికల్లో విజయమ్మ ఓటమికి వాల్తేరు క్లబ్ ఓ కారణమనే అభిప్రాయంతో ఉంది వైసీపీ.దాంతో అధికారంలోకి వచ్చాక దానిని హస్తగతం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. పోలీసులతో క్లబ్ యాజమాన్యాన్ని వేధించారు. వైసీపీ వాల్తేరు క్లబ్ పై కన్నేసిందని ఆరోపణల నేపథ్యంలో విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు బొత్స ఝాన్సీరెడ్డి విజయావకాశాలను తగ్గిస్తాయని చెప్పక్కర్లేదు. అయినా, ఆయన ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ఈ ప్రకటన చేయడం వైసీపీ విశాఖ క్యాడర్ ను ఆశ్చర్యపరిచింది.
నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి విజయావకాశాలు అంతంత మాత్రమే. ఇన్నాళ్ళు విశాఖ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బొత్స సతీమణి విశాఖ ఎంపీగా గెలిస్తే తనకు స్థానికంగా ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళనతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే వాల్తేరు క్లబ్ ఇష్యూను కావాలనే తెరపైకి తీసుకొచ్చారా..? అనే అనుమానాలను బొత్స వర్గం వ్యక్తం చేస్తోంది.