అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు దాదాపుగా ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి ఆ స్థానం నుంచి ఎవరూ ఊహించని విధంగా సీఎం రమేష్ పోటీలో నిలబడ్డారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ బూడి ముత్యాలనాయుడుని నిలబెట్టింది. ఆయన సీఎం రమేష్ కు సరైన ప్రత్యర్థేనా కాదా అన్న సంగతి పక్కన వైసీపీ లెక్కలన్నీ పక్కన పెట్టేసిందని అర్థమవుతోంది. బీజేపీకి సహకరించేందుకే ఇలా చేసిందన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది.
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీనే ఎక్కువగా ఐదుసార్లు గెలిచింది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో.. కాపు, గవర, కొప్పుల వెలమ సామాజికవర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపు 70 శాతంగా చెబుతున్నారు. అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా పెడుతుంటారు. నాన్ లోకల్ అయినప్పటికీ వెలమ వర్గానికి చెందిన సీఎం రమేశ్ సామాజికవర్గం అండ ఉంటుందన్న ఉద్దేశంతో పోటీకి సిద్ధమయ్యారు. ఈ స్థానంలో వైసీపీ కాపు లేదా గవరకు చాన్స్ ఇచ్చి ఉంటే ముందే అడ్వాంటేజ్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఉంది. కానీ కొప్పుల వెలమ వర్గానికే చెందిన బూడి ముత్యాలనాయుడుకు టిక్కెట్ ఇచ్చారు.
ఇప్పుడు పొత్తు కారణంగా కాపు, గవరల ఓట్లు చీలిపోయే అవకాశం లేదు. వైసీపీ అభ్యర్థి కూడా ఈ వర్గాలకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఓట్లు చీలవు. వాస్తవానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఈ సారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తొలుత నిర్ణయించింది వైసీపీ. ఐతే ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేశ్‌ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతోపాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ.. బూడి ముత్యాలనాయుడిని తొలిసారిగా ఎంపీ బరిలోకి దింపింది. ఆయనకు ఇష్టం లేకపోయినా.. ఆయన కుమార్తెకే మాడుగల టిక్కెట్ ఇచ్చి ఒప్పించింది.
గత ఐదేళ్లలో ఆయన పనితీరుపై వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం వంటివి ఆయన ఇమేజ్ ను తగ్గించాయి. మాడుగుల నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉది. కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేశ్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేశ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించిన సీఎం రమేశ్.. గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
నాన్ లోకల్ పేరుతో ఎక్కువ ప్రచారం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూంటే ఈ అంశం ప్రచారంలోకి వెళ్లేదే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే హైలెట్ అవుతున్నాయి. సీఎం రమేష్ .. రాజకీయం ఎలా చేయాలో తెలిసిన నేత. తాను వేధింపులకు అండగా ఉంటానని.. ఒకటి,రెండు ఘటనలతోనే నిరూపించారు. వ్యాపార వర్గాలను ఆకట్టుకున్నారు. బీజేపీ పెద్దల్ని నొప్పించకుండా ఉండేందుకు.. అనకాపల్లి లో వైసీపీ .. తీవ్రమైన ప్రయత్నాలు చేయడంలేదు. ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తోంది.