మా కన్నీటికి నీ దగ్గర సమాధానం ఉందా? మమ్మల్ని ముంచి నువ్వు తెచ్చుకున్న సీటులో గెలవగలవా…? బతకొచ్చినంత మాత్రాన నువ్వు లోకల్ ఎట్లా అయితవ్…? ఇలాంటి పదునైన మాటలతో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై నిర్వాసితులు పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. వెంకట్రామిరెడ్డి చెప్తున్న మాటలకు నిర్వాసితులు ఇచ్చిన కౌంటర్ యాధావిధిగా…
“మాజీ కలెక్టర్ గారు మా ప్రశ్నలకు జవాబు చెప్పండి?”
అయ్యా సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ P. వెంకట్రాంరెడ్డి గారు మీరు తేదీ.25-03-2024 రోజున సంగారెడ్డిలో BRS కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నేను గత 25 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేశాను కాబట్టి నేను “ఇక్కడ పక్క లోకల్” అని అన్నారు. అయ్యా మాజీ కలెక్టర్ గారు మీ మాయిముంత ఎక్కడ ఉంది? ఉమ్మడి మెదక్ జిల్లాలో మీది ఏ మండలం? ఏ ఊరు? ఈ సర్వీస్ బుక్కులో ఏ అడ్రస్ ఉంది, మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంది? జర ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి సార్? మీది లోకల్ కదా!
మీరు వృత్తి రీత్యా (పొట్టకూటికోసం) వివిధ జిల్లాలతో పాటు ఈ జిల్లాలో ఉద్యోగం చేశారు. అంతమాత్రాన మీరు మెదక్ జిల్లా లోకల్ అయితే! మరి ఇక్కడే ముంపు గ్రామాలలో తాత ముత్తాతల నుండి తరతరాల నుండి జీవించి పొట్టకూటికోసం మరియు ఉద్యోగరీత్యా గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోయిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల భూములను, ఇండ్లను తీసుకొని తర్వాత మీరు ఊరిలో ఉంటలేరు! కాబట్టి కొంతమంది నిర్వాసితులను లోకల్ కాదని బెదిరించి ఇప్పటికీ కూడా R/R ప్యాకేజ్ , ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు ఇవ్వలేదు. ముంపు గ్రామాలలో ఆ నిర్వాసితుల మాయిముంతలు, పురుడు, పండుగలు, పెండ్లిలు, చావులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఓటర్ లిస్టులో పేరు, చివరకు ఎక్కడో చనిపోతే వారు పుట్టిన గ్రామాలలో అంత్యక్రియలు చేశారు. అయినా మీరు లోకల్ కాదంటిరి! మీకు ఈ జిల్లాలో పైవి ఏవి లేవు! మరి మీరు ఎట్లా లోకల్ అయితరో జర చెప్పండి సార్?
KCR గారి దగ్గర మెప్పుకోసం ఊర్లకు ఊర్లు ముంచి నిర్వాసిత ప్రజలకు న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వక నోట్లో మట్టికొట్టి, MLC పదవి పొందితివి! ఇప్పుడేమో మీది ఈ జిల్లా కాకున్న BRS నుండి మెదక్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ పొందితివి! మీ రాజకీయ పదవులు, మీ ఆర్థిక పరిపుష్టి నిర్వాసిత గ్రామాల పాపమే!
ఈ సందర్భంగా కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన వాస్తవం గుర్తుకొస్తుంది. ఒక ఇల్లుకు కిరాయి తీసుకున్న కిరాయిదారు ఆ ఇంటిలో కిరాయి ఉంటూ ఆ ఇంటికి రంగులు వేసి, పండుగలు చేసుకున్నంత మాత్రాన ఆ కిరాయిదారుడు ఆ ఇల్లుకు ఓనర్ కాలేడు. అట్లనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన మీరు వృత్తిరీత్యా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంతకాలం పనిచేసినంత మాత్రాన మీరు ఎప్పటికీ స్థానికులు కాలేరు అని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు, నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు.
మీ రాజ్ పుష్ప కంపెనీ పేరుతో ఉమ్మడి మెదక్ లో రియల్ ఎస్టేట్ చేస్తూ మీరు ఆస్తులు పెంచుకున్నంత మాత్రాన మీరు బిజినెస్ మ్యాన్ అవుతారే తప్పా మాకు నాయకుడు కాలేరు అంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు.