లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ…ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో ఎన్నికల ప్రణాలికలను రిలీజ్ చేశాయి. రెండు పార్టీలు కూడా మహిళలు, రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా తమ మేనిఫెస్టోలను రూపొందించాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరుగుతుండటంతో పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొంది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దుతామని…అలాగే ఔత్సాహికులకు ముద్ర రుణాల పరిమితిని 20 లక్షలకు పెంచుతామని తెలిపింది. నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని యువ న్యాయ్ కార్యక్రమం అమలు చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.
చట్ట సభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును క్రమ పద్దతిన అమలు చేస్తామని వెల్లడించింది బీజేపీ. మహిళలను లక్షాధికారులు చేసేందుకు చర్యలు చేపడుతామని పేర్కొంది. ప్రతి పేద కుటుంబంలోని మహిళకు ఎలాంటి షరతులు లేకుండా ఏడాదికి లక్ష రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది.
కనీస మద్దతు ధరను పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఇస్తోన్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను కొనసాగిస్తామని వెల్లడించింది.పంటకు మద్దతు ధర కల్పిస్తామని, వ్యవసాయ ఫైనాన్స్ పై శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
బీజేపీ మేనిఫెస్టో ప్రతిపక్ష పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను తలపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉండి మరోసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొనటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పదేళ్ళుగా కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోలేదంటున్నారు. రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను కాల్చి చంపిన బీజేపీ సర్కార్…పంటలకు కనీస మద్దతు ధరపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న పెదవి విరుపులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మొదలు కావడం గమనార్హం. రైతులకు రుణాలను మాఫీ చేయని కేంద్రం కార్పోరేట్లకు వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేసిందని ఈసారి బీజేపీని నమ్మి మోసపోమని రైతులు తేల్చి చెబుతున్నారు.