బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ పరుష పదజాలంతో కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయనకు నోటిసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11గంటల కల్లా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ పంపిన నోటిసుల్లో పేర్కొన్నారు.
సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను కుక్కల కొడుకుల్లారా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి నివేదిక తెప్పించుకొని అన్నింటిని పరిశీలించి కేసీఆర్ కు ఈసీ నోటిసులు జారీ చేసింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లఘించడమేనని అవినాష్ కుమార్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని… ప్రత్యర్ధి పార్టీల నేతలపై వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసేలా మాట్లాడకూడదని ఈ ఏడాది మొదట్లోనే లేఖలు పంపినట్లు వెల్లడించారు. అయినా కేసీఆర్ మళ్ళీ అదే పంథా అనుసరిస్తున్నట్లు అవినాష్ తెలిపారు. కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పార్ట్ -1 లోని ఒకటో భాగంలోని నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. తాము పంపిన నోటీసులకు గురువారం వరకు సమాధానం ఇవ్వాలని ఆ నోటిసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు.
ఎన్నికల కమిషన్ పంపిన నోటీసులకు కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.