లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరిస్తోన్న విధానంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నినాదం లేక బీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
గత ఎన్నికల్లో కారు – సారూ.. ఢిల్లీలో సర్కార్ అంటూ తెగ హడావిడి చేసిన బీఆర్ఎస్ ..రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి నినాదంతో ముందుకు వెళ్ళాలో తేల్చుకోలేకపోతోంది. దాంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఓట్లను తెచ్చిపెడుతాయా అనే చర్చకు దారితీస్తోంది.
కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావు.. ఇలా పార్టీ ముఖ్య నేతలంతా ఒకటే పాట పాడుతున్నారు. ఏడాది తిరగకముందే రేవంత్ సర్కార్ పతనం అవుతుందని జోస్యం చెబుతున్నారు. రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని ఆరోపణలు చేస్తున్నారు. ఏ సభా, సమావేశానికి వెళ్ళినా బీఆర్ఎస్ నేతలకు ఇది రొటీన్ డైలాగ్ గా మారింది. దీంతో ఈ డైలాగే బీఆర్ఎస్ కు ఎన్నికల నినాదమా అనే సెటైర్లు వేస్తున్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు దోహదం చేస్తాయా ..?అంటే అనుమానమే. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలంతా రేవంత్ సర్కార్ పతనం అవుతుందనే డైలాగ్ బీఆర్ఎస్ కు ఓట్లు రాల్చదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతాడనే ప్రకటన బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది తప్పితే..బీఆర్ఎస్ కు ఎలాంటి మెరుగైన ఫలితం తెచ్చి పెట్టదని స్పష్టం చేస్తున్నారు.