ఏపీలో హై వోల్టేజ్ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఒకటి మైలవరం. దేవినేని ఉమ, జోగి రమేష్ మధ్య 2014లో జరిగిన పోరాటం హైలెట్ అయింది. 2019లో దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ మధ్య ఫైట్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా సమ ఉజ్జీలు అయితేనే పోరు రక్తి కడుతుంది. కానీ ఈ సారి మాత్రం అభ్యర్థుల మధ్య సమఉజ్జీతనం లేకుండా పోయింది. వైసీపీ తరపున నిర్ణయించిన అభ్యర్థిని కేవలం కులం ప్రకారం ఖరారు చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారన్న ఓ నమ్మకంతోనే అభ్యర్థిని పెట్టారు.
విజయవాడ పార్లమెంటు పరిధిలోని మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ అత్యంత కీలకమై స్థానం. టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా గెలుపొందింది. టీడీపీ నేతలు ఎన్.సత్యనారాయణ, జ్యేష్ట రమేశ్‌బాబు, వడ్డే శుభనాద్రిశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఓడిన దేవినేని ఉమకు ఈ సారి చంద్రబాబు సీటు ఇవ్వలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికి.. దేవినేని ఉమపై ఉన్న నెగెటివిటీ కారణంగా పక్కన పెట్టారు. వైసీపీ ఎమ్మల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి పోటీ చేస్తున్నారు.
వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనది మైలవరమే. ఓసారి ఓడిన తర్వాత నియోజకవర్గంలో పని చేసుకున్నా 2019లో చివరి క్షణంలో పెడనకు పంపారు జగన్. ఈ ఎన్నికల్లో మైలవరం నుంచే పోటీ చేయాలని ఆయన మూడేళ్లుగా అనుచరుల్ని పెంచి పోషించుకుంటూ వస్తున్నారు. కానీ పెడన నుంచి మార్చిన జగన్ ఆయనకు మైలవరం ఇవ్వలేదు.. పెనుమలూరు పొమ్మన్నారు. వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో అలాగే వెళ్లారు. మైలవరంలో ఎంపీపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును బరిలోకి దింపారు.
ఆయన యాదవ వర్గానికి చెందిన వారు కావడంతో.. కమ్మ వర్సెస్ బీసీ నినాదంతో గెలిచేద్దామని వైసీపీ అనుకుంటోంది. ఎమ్మెల్యే వసంత కూడా టీడీపీ కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. అటు వైసీపీలోని తన అభిమానుల ఓట్లపైనా గురిపెట్టిన ఎమ్మెల్యే…. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో రెండోసారి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను సర్నాల తిరుపతిరావు ఎలా ఢీకొడతారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యేతో పోల్చితే తిరుపతిరావు ఆర్థిక బలం అంతంత మాత్రమే… దీంతో పార్టీ అండదండలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు.
వైసీపీ అభ్యర్థిగా తిరుపతిరావును పెట్టినా.. ఆయనపై పరిశీలకులుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని నియమించారు. వారి ద్వారానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయితే వారు పార్టీ పంపిన డబ్బును ఖర్చు పెట్టకుండా నొక్కేస్తూండటంతో.. ఒక సారి పరిశీలకుల్ని మార్చారు. మొత్తంగా వైసీపీ కులం కార్డును మాత్రమే నమ్ముకుని రంగంలోకి దిగింది. అధికారంలో ఉన్నపార్టీ అభ్యర్థికి కులం ప్రకారం ఓట్లు వేస్తారా లేదా అన్నదే పాయింట్.