వాహనాలు కొన్నారు. వాడుకుంటున్నారు. సీఎం జగన్ రెండున్నరేళ్ల కిందటే.. గొప్పగా జెండా ఊపారు. కానీ ఇప్పటి వరకూ ఆ వాహనాల డబ్బులు చెల్లించలేదు. వాహనాలు ఇచ్చిన మహింద్రా కంపెనీ అడిగి అడిగి విసుగుపుట్టి కోర్టుకెళ్లింది. అంతేనా టెండర్లు ఖరారు చేసేందుకు ఉన్న గవర్నమెంటు ఈ మార్కెట్ ప్లేస్ పోలీస్‌శాఖను బ్లాక్ లిస్టులో పెట్టింది.
జగన్ రెడ్డి దిశ పేరుతో చేసిన ప్రచార ఆర్భాటం అందరికీ గుర్తుండే ఉంటుంది. దిశ పోలీసు స్టేషన్లకు, పోలీసు అధికారుల కోసం 2022 జనవరిలోనే 163 బొలేరో వాహనాలను మహీంద్ర అరడ్ మహీంద్ర సంస్థ నుంచి కొనుగోలు చేశారు. రెండు విడతలుగా కొనుగోలు చేసిన ఈ వాహనాలకు రూ.14.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022 జనవరిలో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ముఖ్యమంత్రి అదే ఏడాది మార్చి 23న ప్రారంభించి దిశ పోలీసు స్టేషన్లకు అందించారు. ఈ వాహనాలకు సంబంధించిన వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు.
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ నిబంధనల మేరకు ఏపీ పోలీస్‌శాఖ బ్లాక్ లిస్టులోకి చేరుకుంది. దీనివల్ల ఈజీఎం ద్వారా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అవకాశం లేకుండా పోయింది. వాహనాలకు బిల్లులు రాకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడంతో మహీంద్ర సంస్థ కోర్టును ఆశ్రయించింది. అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12 శాతం వడ్డీతో తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. బకాయిలకు 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంది.