తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మరింత పదునెక్కనుంది. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుండి మొదలవుతుండటం, మంచి రోజు కావటంతో మొదటి రోజే నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నామినేషన్లు మొదలవుతున్నాయి.
ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తుండగా, ఏపీ, తెలంగాణ సహా మొత్తం పది రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 25వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉండగా, 29 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇక మొదటి రోజే ప్రధాన అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఏపీలో మంగళగిరి సెగ్మెంట్ నుండి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ మొదటి రోజే నామినేషన్ వేయబోతున్నారు. చంద్రబాబు, పవన్ సహా బీజేపీ నేతల నామినేషన్ల కార్యక్రమానికి బీజేపీ పెద్దలు హజరయ్యే అవకాశం ఉంది.
ఇటు తెలంగాణలోనూ మొదటి రోజు నుండే నామినేషన్ల జాతర సాగుతుండగా… బీజేపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు పార్టీ పెద్దలు రాబోతున్నారు. బీఆర్ఎస్ నేతలకు గురువారమే భీఫాంలు ఇవ్వనుండగా, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారం ముమ్మరం చేస్తారని…సీఎం రేవంత్ రెడ్డి రోజుకు రెండు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.