ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరారనే కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఏ పార్టీలో చేరినా తనకు పెద్ద పీట వేస్తారని ఊహించుకోవడం.. పట్టించుకోకపోతే విమర్శలు ప్రారంభించడం కామన్. ఈ సారి ఆ విమర్శలు చేయడానికి కూడా ఓపిక లేకపోయిందేమో కానీ అసలు కనిపించడం మానేశారు.
2019 ఎన్నికల సమయంలో ఆమె కీలక పదవిలో ఉన్నారు. కానీ ఎన్నికల తర్వాత పార్టీకి భవిష్యత్ లేదని..మా పార్టీ బీజేపీ అని ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ కే ఊపు ఉందని చెప్పి ఆపార్టీలో చేరారు. అసెంబ్లీ టిక్కెట్ వస్తుందని అనుకున్నారు. పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్ సభ విషయంలోనూ పట్టించుకోలేదు. గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే మెదక్ ఎంపీ సీటును విజయశాంతి ఆశించారు. అసెంబ్లీకి వచ్చే సరికి మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి సీటిచ్చారు. లోక్ సభకూ పట్టించుకోలేదు.
ప్రచారానికి కూడా రాములమ్మను పిలవడం లేదు. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగసభకు ఆమెను ఆహ్వానించడం మర్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కసారి గాంధీభవన్‌కు వచ్చిన ఆమె ఆ తర్వాత ఇంటికే పరిమతమయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. ఎంతో ఉత్సహంగా పార్టీలో చేర్చుకోవడం, ఆ తర్వాత సముచిత స్థానం కల్పించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే విమర్శలు ప్రారంభిస్తే అసలు పట్టించుకోరని అనుకుటున్నారు. కొంచెం పెద్ద నేతలు ఎవరైనా రాయబారానికి వస్తే ప్రచారం చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు పట్టించుకుంటారా అన్నదే సందేహం.