తెలంగాణలోనే సంచలనం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసులపై షకీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మరో కేసు తెరపైకి తీసుకరావటం వెనుక కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా కొడుకుపై కేసుల్లో కుట్ర ఉందని, మానసికంగా వేధించి… ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించి నా కొడుకు రాహిల్ ను ఇరికిస్తున్నారని షకీల్ ఆరోపించారు. ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి నా కొడుకు పేరు చెప్పిస్తున్నారన్నారు. ఓ కేసులో కోర్టు ద్వారా బెయిల్ రాగానే, మరో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాజకీయాల్లో ఉండటమే మేము చేసిన తప్పా… మా పిల్లలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కిందిస్థాయి అధికారులతో పాటు నా కొడుకుతో ఉన్న పిల్లలను బెదిరించి, వారి తల్లితండ్రులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తప్పు చేసి ఉంటే… కోర్టులో నిరూపించి ఉరితీయండి, నేను సంపూర్ణంగా సహకరిస్తా. అంతేకానీ రాజకీయ కక్షల్లో భాగంగా ఇదంతా చేయటం మంచిది కాదంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్ వీడియో విడుదల చేశారు. డీసీపీ విజయ్ కుమార్ ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించటం ఏంటని ప్రశ్నించారు.
అయితే, దీనిపై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పారదర్శకంగా విచారణ సాగుతోందని, పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా నిందితుడిగా ఉన్నారన్నారు.