తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం నుంచి మరో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ , సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
2015,16 వరుస సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నాడు ఎండలకు భరించలేక ఎంతోమంది మరణించారు. మళ్లీ ఇప్పుడు సూర్యుడు ప్రతాపం ప్రదర్శిస్తుండటంతో వాతావరణ శాఖ అధికారులు ముందస్తు అలర్ట్ ఇచ్చారు.
ఏవైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.