తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కొంత అనుకూల పరిస్థితి ఉందని భావిస్తోన్న బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గతానికి భిన్నంగా వలస నేతలకు టికెట్ ఆఫర్ చేసి ఎన్నికల బరిలో నిలిపారు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ కుమారుడు వంశీకృష్ణ పోటీలో ఉండటంతో అక్కడ బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే ఉద్దేశంతో కాంగ్రెస్ నేత గోమాస శ్రీనివాస్ తో చర్చించి ఆయనకు టికెట్ కేటాయించింది. కానీ , ఆయన ప్రచారంలో పెద్దగా పాల్గొనడం లేదని, స్థానిక నేతలను కలుపుకొని వెళ్ళడం లేదన్న అసంతృప్తి స్థానిక పార్టీ నేతల్లో ఉంది. గోమాస ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపుకు రాచబాట వేసినట్లు అవుతుందని కమలం క్యాడర్ ఆగ్రహంగా ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మార్చనున్నారనే జోరుగా చర్చ జరుగుతోంది. టికెట్ పై హామీతో కాంగ్రెస్ లో చేరి భంగపడిన వెంకటేష్ నేతను పార్టీలో చేర్చుకొని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ ను కాదని వివేక్ కుమారుడుకు టికెట్ ఇవ్వడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ ను పార్టీలో చేర్చుకొని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని బీజేపీ సమాలోచనలు మొదలు పెట్టినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.