మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రమంత్రి కాబోతున్నారా…? మల్కాజ్ గిరి దీవించి పంపితే జరిగేది అదే అంటూ సంచలన ప్రకటన చేశారు కేంద్రమంత్రి. మల్కాజ్ గిరిలో ఈటల గెలిస్తే కేంద్రమంత్రి అవుతారు అంటూ కొంతకాలంగా క్యాడర్ లో చర్చ జరుగుతున్నా, ఇప్పుడు ఏకంగా ఢిల్లీ నుండి వచ్చిన బీజేపీ కీలకనేత హర్దీప్ సింగ్ పూరి కామెంట్ చేయటం ఈటల వర్గంలో కొత్త జోష్ నింపుతోంది.
ఈటల రాజేందర్ కు ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా బీజేపీ ఆయన సేవలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేయదు. దేశవ్యాప్తంగా వాడుకుంటుంది. మల్కాజ్ గిరి ప్రజలారా… ఈటలను గెలిపించి పంపించండి అని ఆయన పిలుపునిచ్చారు.
ఇప్పటికే కిషన్ రెడ్డి రాష్ట్రం నుండి మంత్రిగా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఓ దశలో తమకు కూడా అవకాశం వస్తుందని అరవింద్ లాంటి వారు గతంలో ఆశల్లో ఉన్నారు. ఈసారి గెలిస్తే నేను మంత్రి అవుతానంటూ అరవింద్ ప్రచారం కూడా చేసుకుంటున్న తరుణంలో కేంద్రమంత్రి వచ్చి ఈటలను రేసులో నిలపటం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి బీజేపీలో ఇది పెద్ద చర్చకే దారి తీస్తుందన్న అభిప్రాయాలున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రం నుండి లక్ష్మణ్ కూడా క్యాబినెట్ రేసులో ఉంటారు. దీంతో గతంలో కాంగ్రెస్ లో సీఎంల లిస్ట్ ఎక్కువగా ఉన్నట్లు, ఇప్పుడు బీజేపీలో కేంద్రమంత్రుల ఆశావాహుల లిస్ట్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బీజేపీ గెలుస్తుందో లేదో అన్న అనుమానాలు మొదలవుతుంటే… వీళ్లు కేంద్రమంత్రుల ఆశల్లోకి వెళ్తే మొదటికే మోసం వచ్చినా ఆశ్యర్చపోనక్కర్లేదు అంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు.