శేఖర్ కమ్ముల సినిమాలో హిట్లూ, సూపర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయదగిన సబ్జెక్ట్ మాత్రం ‘లీడర్’ మాత్రమే. ఈ సినిమాని కొనసాగిస్తే బాగుంటుందని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా అదే మాట అంటున్నాడు. తన కెరీర్లో లీడర్ చాలా సంతృప్తి ఇచ్చిన చిత్రమని, దానికి సీక్వెల్ చేస్తే మళ్లీ రానానే హీరో అని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకుడిగా మారి పాతిక సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తన మనసులోని భావాల్ని పంచుకొన్నారు.
చాలామంది తనని ‘హ్యాపీడేస్ 2’ చేయమని అంటున్నారని, అయితే తనకు అలాంటి పాయింట్ ఏమీ తట్టలేదని, ఇప్పటికీ ‘హ్యాపీడేస్’ ఫ్రెష్‌గానే ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ‘లీడర్ 2’ చేసే ఆలోచన మాత్రం ఉందన్నారు. అప్పట్లో లక్ష కోట్ల అవినీతి పాయింట్ పై సినిమా తీశానని, ఇప్పుడు ఆ అంకెలు మారిపోయాయని, రాజకీయాలు మరింతగా దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు శేఖర్ కమ్ముల. ఇప్పటి సినిమాల్లో సమస్య ఒక్కటే చెబితే సరిపోదని, పరిష్కారం కూడా చూపించాలని, అవినీతికి పరిష్కారాన్ని సహేతుకంగా చూపించినప్పుడే ఇలాంటి కథలకు ఆదరణ ఉంటుందన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ గురువారమే రీరిలీజ్ అయ్యింది. మరోవైపు ఆయన ధనుష్, నాగార్జునలతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మనిషితత్వాన్ని కొత్త రీతిలో ఆవిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు శేఖర్ కమ్ముల.