” అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు ” .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి… ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా చేయాలో అంత డ్రామా చేశారు. ఐదేళలు అయింది. ఇప్పుడు సీపీఎస్ రద్దు కాదు కదా.. అలాంటి ఆలోచనే వచ్చే ప్రభుత్వాలకు రాకుండా సీపీఎస్ ద్వారా ఉద్యోగులకు చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా గ్యారంటీగా చూపించి అప్పులు తెచ్చుకున్నారు.. సీపీఎస్ ఉద్యోగుల్ని నిట్ట నిలువగా మోసం చేశారు. అయినా తాము 99.8 శాతం అమలు చేశామంటూ అడ్డగోలు మాటలు చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
సీపీఎస్ కోసం ఉద్యమించిన వారిపై కేసులు
జగన్ రెడ్డిని నమ్మి నట్టేట మునిగిపోయారు సీపీఎస్ ఉద్యోగులు. ఇలా సీఎంగా ప్రమాణం చేయగానే అలా వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. తీరా కుర్చీ ఎక్కా సీపీఎస్ రద్దు చేయమన్న వారిపై కేసులతో విరుచుకుపడ్డారు. ఉద్యమాలు చేసిన వారిని హింస పెట్టారు. వారి కుటుంబాల్లో వేదన మిగిల్చారు. వారంలో రద్దు చేస్తామన్న ఎన్నికల హామీ… ఆయన భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా చెప్పుకునే మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారమే అడుగుతున్నామని సీపీఎస్ ఉద్యోగులు చెప్పడం పెద్ద తప్పుగా ఈ ప్రభుత్వంలో మారింది. వారి ఉద్యమంపై కేసుల ఉక్కుపాదం మోపారు.
జీపీఎస్ పేరుతో కొత్త నాటకంతో ఉద్యోగుల నోట్లో మట్టి
సీపీఎస్‌కు బదులు జీపీఎస్ తెస్తున్నామని… వారి అనుమతి లేకుండానే చట్టం చేసేశారు. దాన్ని ఎవరూ ఎంచుకోలేరు. సీపీఎస్ రద్దు చేయడం అంటే.. ఉద్యోగుల జీతం నుంచి మినహాయిస్తున్న పది శాతాన్ని కట్ చేయకుండా ఇచ్చేయాలి. ఆ తర్వాత పాత పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలి. కానీ ఇక్కడ ఉద్యోగుల జీతం నుంచి సీపీఎస్ పేరుతో మినహాయించుకుంటున్న మొత్తాన్ని .. ఇక ఉద్యోగుల ఖాతాలకే బదిలీ చేస్తామని చెప్పడం లేదు. ఇప్పటి వరకూ కత్తిరించిన పది శాతాన్ని ఇస్తామని చెప్పడం లేదు. కానీ.. సీపీఎస్ రద్దు చేసేశాం జీపీఎస్ తెస్తున్నాం అని ప్రచారం చేసుకున్నారు. ఏదీ రద్దు చేయలేదు. దొంగ మాటలు చెప్పడానికి అలవాటు పడిన వారు.. తప్పుడు ప్రచారం చేయడంలో తమదైన ముద్ర వేసిన వారు.. ఉత్తుత్తి ప్రచారం చేసుకున్నారు.
Read Also : మేనిఫెస్టో మోసాలు : మద్యనిషేధం చేసే ఓట్లడుగుతామన్నారే !
అవగాహన లేక హామీ ఇచ్చామని చెప్పిన రోజునే రాజీనామా చేయాలి కదా !
సీపీఎస్ రద్దుపై జగన్ రెడ్డికి అవగాహన లేక హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇంత కంటే దౌర్భాగ్యం.. చేతకాని తనం ఏమైనా ఉంటుంది. అవగాహన లేదని చెప్పుకునేంత ఘోరమైన రాజకీయ నాయకుడికి పదవిలో ఉండే అర్హత ఉంటుందా?. అదే రోజు రాజీనామా చేయాలి కదా. కానీ ఆ విషయం కూడా తప్పు కాదన్నట్లుగా అడ్డగోలుగా రాజకీయం చేస్తూనే ఉన్నారు తప్పుడు ప్రచారాలు… ఫేక్ పాలనతో ఐదేళ్లుగా ప్రభుత్వం ప్రజలందర్నీ మోసం చేస్తూనే ఉంది. నమ్మిన వాళ్లే గొర్రెలన్నమాట. జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ఉద్యోగులు జీవిత కాలంలో మర్చిపోయే అవకాశం లేదు. ఉద్యోగుల విషయంలో సీపీఎస్ రద్దు అనేది జగన్ చేసిన ఓ నమ్మకద్రోహం మాత్రమే.. ఇంకా వారి జీవితాల్ని నాశనం చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి.