‘హనుమాన్’ లాంటి హిట్ తరవాత ఏ హీరోకైనా కాస్త కన్ఫ్యూజన్ మొదలైపోతుంది. తరవాత ఏం చేయాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనే విషయంలో తర్జన భర్జనలు పడిపోతుంటారు. ఆ గందరగోళంలో తప్పులు చేస్తుంటారు. లేదంటే క్రేజ్ ఎలాగూ వచ్చింది కదా అని, దాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ములు చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. రెండూ… ప్రమాదమే! ఒక్కసారిగా వచ్చి పేరు, క్రేజ్ రెండూ పోతాయి. ఈ తప్పు తేజా సజ్జా మాత్రం చేయడం లేదనిపిస్తోంది.
అంతక ముందు కూడా తేజా ఖాతాలో హిట్లున్నాయి కానీ, మొత్తం చిత్రసీమే తనవైపు చూసేలా చేసింది మాత్రం ‘హమానున్’. ఏకంగా పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వచ్చింది. కుర్రాడు, అసలే ఉడుకురక్తం, నాలుగు డబ్బులు వెనకేసుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. ఈ స్పీడులోనే నాలుగైదు సినిమాలు ఒప్పుకొని, అడ్వాన్సులు తీసుకొని, సెటిలైపోవొచ్చు. కానీ ‘హనుమాన్’ తరవాత ఒక్క సినిమా కూడా తేజా ఒప్పుకోలేదు. ఎంత భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇస్తానన్నా తీసుకోలేదు. ‘హనుమాన్’ చేస్తున్నప్పుడు తన ధ్యాస ఆ సినిమాపైనే ఉంది. ‘హనుమాన్’ మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించాడు. హనుమాన్తో తన జాతకం మారుతుందని, గ్రాఫ్ పెరుగుతుందని, దాన్ని బట్టి సినిమాల్ని ఎంచుకోవాలని గట్టిగా ఫిక్సయ్యాడు. తన నమ్మకం నిజమైంది. హనుమాన్ తో స్టార్ డమ్ వచ్చేసింది.
ఇప్పుడు తేజా దృష్టి ‘మిరాయ్’పై మాత్రమే ఉంది. ఈ సినిమా కూడా తన కెరీర్లో గేమ్ ఛేంజర్ అని తెలుసు. అందుకే ‘మిరాయ్’ పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. నిజంగానే నూటికి నూరుపాళ్లు సరైన ఆలోచనే ఇది. హడావుడిలో సినిమాలు చేసి, వచ్చిన క్రేజ్ పోగొట్టుకోవం కంటే, ఆచి తూచి అడుగులు వేయడం చాలా మంచిది. ఒక్క హిట్టుతోనే సరిపెట్టుకొని, ఇళ్లకు వెళ్లిపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. తను మాత్రం అలా కాకూడదన్నది తేజా ప్రయత్నం. తేజా గోల్స్ చాలా పెద్దవి. లాంగ్ కెరీర్ని టార్గెట్ చేసి, ఇప్పటి నుంచే గట్టిగా పునాదులు వేసుకొంటూ వస్తున్నాడు తేజా. ‘హనుమాన్’ ఎంత పెద్ద హిట్టయినా, తన కెరీర్ని అదొక్కటే మార్చలేదు అని తనకు గట్టిగా తెలుసు. మరిన్ని మంచి సినిమాలు చేస్తే తప్ప, పటిష్టమైన పునాది పడదని అర్థమైంది. అందుకే ఒక్కో మెట్టూ పేర్చుకొంటూ వెళ్తున్నాడు. వెల్ డన్.. తేజా!