ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి మృతి చెందిన ఘటనపై తీవ్ర దుమారం రేగుతుండగా…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్ధినిలు అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది.
హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలంలోని చేల్లెపల్లి పరిధిలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఐదో తరగతి చదువుతోన్న విద్యార్థినిలకు గురువారం తెల్లవారుజామున వాంతులు కావడంతో నేరేడుచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యార్ధినిలు అస్వస్థతకు గురి కావడానికి కారణం ఫుడ్ పాయిజనే కారణమా..? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ, వరుసగా జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల్లోని గురుకుల పాఠశాలలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గురుకుల పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేందుకు ఈ వరుస సంఘటనలే నిదర్శనమని ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.