మాధవీలత… బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె రెండు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాధవీలత చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో మాధవీలతకు పేరుమోసిన ఓ కార్పోరేట్ ఆసుపత్రి ఉంది. పేదల రక్తాన్ని పీల్చి, పిప్పి చేస్తారని ఆ ఆసుపత్రిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశాన్ని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రస్తావించారు. కరోనా సమయంలో పేదల నుంచి భారీగా వసూళ్లు చేశారనే విషయంపై ప్రశ్నించగా…ఆమె ఇచ్చిన సమాధానం బిజినెస్ మెన్ తరహాలో ఉందని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.
నేనేం ఛారిటబుల్ ట్రస్ట్ నడపడం లేదు… ఆసుపత్రి ముందు ఛారిటబుల్ ట్రస్ట్ అని బోర్డు ఏం పెట్టలేదు కదా అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సేవ చేసేందుకు , అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్తూనే… తను ఛారిటబుల్ ట్రస్ట్ నడపడం లేదని బాధ్యతారహితంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంపాదించిన ఆస్తులకు రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది మహాతల్లీ అంటూ మాధవీలతపై మండిపడుతున్నారు.