ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్ గా మారుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి జడ్జి ముందు శరత్ చంద్రారెడ్డి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
సౌత్ గ్రూప్ కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం ఈ కేసులో ఇప్పుడు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. కవిత వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్న భారత జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షల విరాళం కూడా ఇచ్చారని సీబీఐ స్పష్టం చేసింది. నిధులు సమకూర్చే విషయంలో శరత్ నిరాకరించడంతో ఆయనను కవిత బెదిరించారని , నీ వ్యాపారం ఎలా సాగుతుందో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిందని ఇటీవల సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.
శరత్ ను బెదిరించిన విషయంతోపాటు పలు అంశాలపై ఆధారాలను ముందుంచి కవితను సీబీఐ, ఈడీ అధికారులు ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ దర్యాప్తు సంస్థలు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాయి. బెయిల్ కోరుతూ కవిత తరఫు న్యాయవాదులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. నేపథ్యంలోనే ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 23న ముగుస్తుండటంతో కవిత బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇస్తేబయట ఉన్న వారిని ఆమె ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ వాదిస్తున్నాయి. తాజాగా ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఆమెకు బెయిల్ వచ్చేది కష్టమేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.