ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లో కారు జోరు కనిపించింది. రెండు మునిసిపల్ కార్పొరేషన్లకు, రెండు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఫలితం ఖరారు కావడంతో.. నాలుగింట రెండుచోట్ల గులాబీ జెండా రెపరెపలాడినట్లయింది. బుధవారం నాడు ఓట్ల లెక్కింపు మొదలైన అతి కొద్ది సమయానికే అచ్చంపేట ఫలితం క్లీన్స్వీప్గా తెరాస పరం కావడం అందరికీ తెలిసిన సంగతే. అలాగే ఖమ్మం సీటులోనూ గులాబీ జోరు కనిపించింది. 50 డివిజన్లు ఉన్న ఖమ్మంలో కార్పొరేషన్ ఎవరిదో నిర్ధరణ అయ్యే పాటికి అనగా.. సగానికి పైగా మెజారిటీ ఒకే పార్టీకి దక్కే పరిస్థితి వచ్చే సమయానికి… ప్రత్యర్థులకు కేవలం రెండే స్థానాలను విడిచిపెట్టారు. కాంగ్రెస్ 3 వైఎస్సార్ కాంగ్రెస్ 1 వామపక్షాలు 3 స్థానాల్లో మాత్రం ఉనికిని చాటుకున్నారు. సగానికి పైగా ఫలితాలు తేలే సమయానికి కారు పార్టీకి 25 స్థానాలు లెక్కతేలాయి.
ఖమ్మం జిల్లా సాధారణంగా తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న జిల్లాగా గతంలో పేరుండేది. అలాంటిది గతంలోనే తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, తెరాసలో చేరిన తర్వాత.. అక్కడ వారి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. తుమ్మల బలమైన నాయకుడు కావడం, తెరాస అధికారంలో ఉండడంతో.. తెలుగుదేశం వారందరూ కూడా.. కాస్త ముందు వెనుకగా.. తెరాసలోకి వలసబాట పట్టారు. జిల్లా అంతటా కూడా తెరాస బలం పెరిగింది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వారు తమ బలాన్ని స్పష్టంగా నిరూపించుకున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లో కూడా తెరాస తమ విజయ దుందుభిని మోగించడం విశేషం.