ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది. దీంతో షర్మిల నోటికి తాళం వేసేలా వైసీపీ ఎత్తుగడలు వేస్తున్నా అవన్నీ నవ్వులపాలు అవుతున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఆదోనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల… వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమయంలో కొంతమంది వైసీపీ జెండాలు పట్టుకొని వచ్చారు. వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ సిద్దం.. సిద్దం అంటూ నినాదాలు చేశారు. అందుకు షర్మిల ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేనికి సిద్దం..? మళ్లీ బీజేపీకి గులాం గిరి చేయడానికా..? రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సిద్దమా..? మళ్లీ 11 లక్షల కోట్లు అప్పు చేసేందుకు సిద్దమా..? రైతులను ముంచేందుకు సిద్దమా..?మద్యపాన నిషేధం హామీతో మహిళలను మోసం చేసేందుకు సిద్దమా..? దేనికి సిద్దం అన్నా..? అంటూ షర్మిల అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
మేము కూడా సిద్దంగానే ఉన్నాం. వైసీపీని గద్దె దించేందుకు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. జగన్ పై విమర్శలను ఎక్కుపెట్టారు. షర్మిల ప్రసంగాన్ని అడ్డుకొని ఆమెను నవ్వులపాలు చేయాలనుకుంటున్నా వైసీపీ ప్లాన్స్ ఇలా నవ్వుల పాలు అవుతున్నాయనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.