పాన్ ఇండియా హీరోలు
పాన్ ఇండియా సినిమాలూ
ఉన్నప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్నవాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గట్టిగా గుంజుతున్నవాళ్ల గురించే ఈ కథనం.
ప్రస్తుతం భాషా బేధాలు లేకుండా స్టార్స్ అందరూ మమేకమై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఏ భాషలో ఏ సినిమా వచ్చినా అది అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా అవతారం ఎత్తుతున్నారు. దర్శకులకూ మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రొడ్యూసర్స్ కి లాభాలు వస్తున్నాయి. ఒకేసారి, ఒక భాషలో పెట్టిన ఖర్చుతో అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసుకోవచ్చు. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇతర భాష లకు కలిపి ముందే భారీ అమౌంట్ ముడుతోంది. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పక్కరలేదు. ఇదే బాటలో హీరోయిన్స్ కూడా నడుస్తున్నారు. ఒక సినిమా హిట్ అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ లు అందుకుంటూ అన్ని భాషల్లో నటిస్తున్నారు.
పాన్ ఇండియా హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో కనిపించే మొదటి పేరు.. రష్మిక మందన్న. ఈ అమ్మడు ‘కిరాక్ పార్టీ’ అనే సినిమాతో కన్నడలో డెబ్యూ ఇచ్చింది. టాలీవుడ్ లో ‘ఛలో’ సినిమాతో ఎంటర్ అయ్యింది. ‘గీత గోవిందం’ తన కెరీర్ని మలుపు తిప్పింది. కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. తరవాత నుంచి వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫాలోయింగ్ పెంచుకుంది. పుష్పతో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ లో పాగా వేసి కొన్నిసినిమాల్లో నటించింది. యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ‘యానిమల్’ మూవీ ఇచ్చిన సక్సెస్ జోరుతో మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయనుంది. ప్రజంట్ ‘పుష్ప 2’ తో ప్రేక్షకుల్ని అలరించనుంది.సందీప్ వంగా ప్రభాస్ తో తీసే స్పిరిట్ చిత్రంలో రష్మిక నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
అనుష్క కెరియర్ మొదట టాలీవుడ్ లో మొదలయ్యింది. ఇక్కడ వచ్చిన గుర్తింపుతో తమిళం లో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడిప్పుడే మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో నేరుగా సినిమాలు చేయకపోయినా, రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ లతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం మలయాళం లో ఓ సినిమా చేస్తోంది. అది పాన్ ఇండియా సినిమానే. భవిష్యత్తులో అనుష్క మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తుందేమో చూడాలి. శృతి హాసన్ ‘సలార్’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాతో నిధి శెట్టి కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ప్రజంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ బాషల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి నితీష్ తివారి ‘రామాయణం’లో సీతగా కనిపించనుంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. తమన్నా తెలుగు, తమిళం, హిందీలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. నయనతార తెలుగు, తమిళం , మలయాళం లో సినిమాలు చేస్తూ సౌత్ లో స్టార్ స్టేటస్ అందుకుంది. రీసెంట్ గా జవాన్ సినిమాతో నయన్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. నయన కాల్షీట్ల కోసం కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు క్యూలో ఉన్నారు.
ఆలియా, కియారా, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ భామలు కూడా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగం అవుతున్నారు. ఆలియా ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది. ‘గంగూబాయి కథియా వాడి’, ‘RRR’, ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకొంది. మహేష్ – రాజమౌళి కాంబో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ తనే కథానాయిక అనే వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ రామ్ చరణ్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ లో నటిస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. దేవర సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇస్తూనే ఎన్టీఆర్ లాంటి స్టార్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయ్యింది జాన్వీ కపూర్. బుచ్చి బాబు సాన తో చరణ్ చేస్తున్న సినిమాలో కూడా జాన్వీ హీరోయిన్. ఇలా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో హీరోలతో పాటు సమానంగా సత్తా చాటుతున్నారు. నిర్మాతలు కూడా పాన్ ఇండియా గుర్తింపు ఉన్న హీరోయిన్లపైనే దృష్టి పెడుతున్నారు. పారితోషికం కాస్త అటూ ఇటూ అయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కాబట్టే.. ఈ కథానాయికల జోరు.. నాన్ స్టాప్ గా సాగుతోంది.