ఇళయరాజా స్వరజ్ఞాని. సంగీత బ్రహ్మ. ఆయన అభిమాని కానివారంటూ ఉండరేమో..?! ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళయరాజాకు `కాపీ రైట్స్`పై మమకారం ఎక్కువైపోతోంది. తన పాట ఎవరు పాడినా, వాడుకొన్నా.. `ఆ పాట నాది.. ఆ పాట వాడుకొనే హక్కు నాది` అంటూ చిన్న పిల్లాడిలా పేచీ పెడుతుంటారు. కాపీ రైట్స్ రూపంలో తనకు ఎంతో కొంత ముట్టజెప్పాలని అల్లాడిపోతుంటారు. ఈ విషయంలో ఇళయరాజా అభిమానులు కూడా ఆయన్ని ఒప్పుకోలేరు. ఇంత గొప్ప స్వరజ్ఞానికి ఇంకా డబ్బులపై మమకారం పోలేదా అని విస్తుపోతుంటారు. కాపీ రైట్ విషయంలో తన మిత్రుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతోనే గొడవకు దిగిన చరిత్ర ఇళయరాజాది. కాపీ రైట్స్ విషయంలో ఆయన కోర్టు మెట్లెక్కడం పారిపాటిగా మారిపోయింది. తాజాగా… ఏకో రికార్డింగ్ సంస్థపై కోర్టులో కేసు వేశారు. ఇళయరాజా పాటల్లో ఎక్కువ శాతం ఏకో దగ్గరే ఉన్నాయి. అయితే ఏకో తన పాటల్ని వాడుకొనే ఒప్పందం గడువు పూర్తయ్యిందని, ఇకపై ఆ సంస్థ తన పాటల్ని వాడుకొంటే కాపీ రైట్ యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఇళయరాజా.
ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఏకో సంస్థ తరపున న్యాయవాది కాస్త గట్టిగానే వాదించారు. ముత్తు స్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి లాంటి సంగీత త్రిముర్తుల కీర్తనలు అందరూ వాడుకొంటారని, వాటిపై కాపీ రైట్ యాక్ట్ ఎవరూ కోరలేదని, అలాంటప్పుడు ఇళయరాజా ఇందుకు ఎలా అతీతుడు అవుతాడని వాదించారు. అయితే ఇళయరాజా న్యాయవాది మాత్రం ‘ఆ ముగ్గురు కంటే.. ఇళయరాజానే గొప్పవాడు’ అనే రీతిలో తమ వాదనలు వినిపించారు. దీన్ని న్యాయ మూర్తుల బెంచ్ కూడా అంగీకరించలేదు. ఆ ముగ్గురు కంటే ఇళయరాజా గొప్పవాడు కాదని, వాళ్లకు లేని మినహాయింపు.. ఇళయరాజాకు ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసుపై తీర్పుని ఈనెలాఖరుకు వాయిదా వేసింది.