తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ సమయంలో రైతుల ఆశలపై అకాల వర్షం ఒక్కసారిగా నీళ్లు చల్లింది.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా పలు జిల్లాలో చోట్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా తెరుచుకోలేదు. అధికారులు కూడా ఎన్నికల బిజీలో ఉండటంతో ధాన్యం కొనుగోలు ఇంకా ఊపందుకోలేదు. సరిగ్గా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరే ఈ సమయంలోనే రైతుల ఆశలపై ఒక్కసారిగా అకాల వర్షం రూపంలో పిడుగు పడింది. రెక్కల కష్టాన్ని అంతా ధారబోసి సేద్యం చేసి పంట పండిస్తే అకాల వర్షాలు తమ ఆశలపై నీళ్లు చల్లాయని కన్నీటిపర్యంతం అవుతున్నారు.
అనూహ్యంగా వర్షం కురవడంతో కోతలకు సిద్దమైన వరి, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పలు ప్రాంతాల్లో తడిసిపోవడంతో పలు ప్రాంతాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటను ఎలా కాపాడుకోవాలని మొగులు వైపు మొహం పెట్టి పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు.