తొలి ఓవర్లో 19..
రెండో ఓవర్లో 21..
మూడో ఓవర్.. 22..
నాలుగో ఓవర్ మళ్లీ.. 21..
ఆరు ఓవర్లకు 125.
ఆడుతోంది మైదానంలోనా? అది ఐపీఎల్ మ్యాచా? లేదంటే మొబైల్ లో స్టిక్ క్రికెట్టా? అనే సంబరం.
చూస్తోంది లైవేనా. లేదంటే హైలెట్సా..? అనేంత ఆశ్చర్యం.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు చేసిన విధ్వంసం ఇది. ఈ సీజన్లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు.. మరోసారి సత్తా చాటింది. ఐపీఎల్లో కొన్ని పాత రికార్డులకు చెదలు పట్టేలా చేసింది. ఏమా విధ్వంసం.. ఏమా బాదుడు..? తొలి పది ఓవర్ల ఆట చూస్తే.. ఈసారి ఐపీఎల్లో 300 స్కోరు చూడడం ఖాయం అనిపించింది. సన్‌రైజర్స్ నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డు మళ్లీ తనే తిరగరాస్తుందనిపించింది. మధ్యలో కాస్త దూకుడు తగ్గడం, వికెట్లు కోల్పోవడం వల్ల 266 పరుగులకు పరిమితమైంది. లేదంటే… వరల్డ్ రికార్డ్ స్కోరు చూసేవాళ్లమే.
ముంబైపై, బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్న జట్టుపై ఏకంగా 277 పరుగులు చేసి షాక్ ఇచ్చిన సర్‌రైజర్స్, వారం తిరక్కుండానే కొలకొత్తాపై 287 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు ఆ రికార్డుకి పాతరేసేదే. కానీ జస్ట్ లో మిస్సయ్యింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మలు రెచ్చిపోవడం.. క్లాసన్ వీర బాదుడు బాదుతుండడం, యువ ఆటగాళ్లు నితీష్ రెడ్డి హిట్టింగ్ అనే పదానికి నిర్వచనంలా మారడం ఇవన్నీ హైదరాబాద్ ఇన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి ప్రధాన కారణాలు. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌కి బంతులు వేయడానికి బౌలర్లు భయపడిపోతున్నారంటే, బాల్ బోయ్స్కి హెల్మెట్స్ ఇస్తున్నారంటే… ఈ విధ్వంస రచన ఎలా సాగుతోందో అర్థం చేసుకోవొచ్చు. 7 మ్యాచ్‌లలో హైదరాబాద్ 5 మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అన్నిసార్లూ జట్టుని బ్యాటర్లే గెలిపించారు. ఈ దూకుడు ఇలానే కొనసాగితే.. మరో ఐపీఎల్ ట్రోఫీ సన్‌రైజర్స్ సొంతం అవ్వడం ఖాయం. ఈ సీజన్లో 300 పరుగుల రికార్డ్ స్కోరు చేయగలిగే జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ మాత్రమే. ఆ మైలురాయి అందుకోవడం కూడా ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.