తెలంగాణ బీజేపీ లోక్ సభ అభ్యర్థుల్లో నలుగురి బీఫాంలు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి మాధవీలత కూడా ఉన్నారు.హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి నుంచి ప్రకటించిన గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డిలకు బీ ఫామ్‌ను నిలిపివేసింది. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేసి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమెకు బీ ఫామ్ నిలిపివేశారు.
గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డిను మారుస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్.. బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. గోమాస శ్రీనివాస్ ను ప్రస్తుతం బుజ్జగిస్తున్నారు. ఇక సైదిరెడ్డిపై బీజేపీ నేతల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడ తేరా చిన్నపరెడ్డిని ఖరారు చేస్తారని అంటున్నారు. మహబూబాబాద్ విషయంలో సీతరాం నాయక్ సరిగ్గా ప్రచారం కూడా చేయలేకపోతున్నారు.
అయితే .. మాధవీలత బీఫాం పెండింగ్ పెట్టడమే ఆశ్చర్యకరంగా మారింది. ఆమె వివాదాస్పద వ్యవహారశైలి సమస్యగా మారుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఆమె మసీదుపై బాణం ఎక్కు పెట్టిన వీడియో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ప్రచార వీడియోలు వివాదాస్పదంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె తనదైన ముద్ర వేశారని.. మార్చలేరన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.