తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైప్ ఇచ్చిన ఎమ్మెల్యేల చేరికల అంశం క్రమంగా చల్లారిపోతోంది. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందే ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటామని బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన కారణాలతో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు వెనుకడుగు వేస్తున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చివరి క్షణంలో ఆగిపోయారు.
తనపై అనర్హతా వేటు పడే అవకాశం ఉందని.. బీఆర్ఎస్ఎల్పీ విలీనం అయ్యేంత మంది కాంగ్రెస్ లో చేరితే తాను సిద్ధమని ప్రకటించారు. చాలా మంది ఎమ్మెల్యేలది అదే పరిస్థితి. తాము వెళ్లి చేరితే పార్టీ మార్పు కింద రిస్క్ లో పడతారు. ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ అయిన కోర్టులు ఎలాంటి ఆదేశాలిస్తాయో తెలియదు. అందుకే ముందు జాగ్రత్తలు పడుతున్నారని అనుకోవచ్చు.
ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. ఓ పదహారు మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి వచ్చారు. దాదాపుగా అందరూ ఖండించారు. ఎవరూ పార్టీలో చేరలేదు కూడా. లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగానే చేరికలు ఉంటాయని తాజా పరిస్థితులు నిరూపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుదనుకుంటే.. పోలోమంటూ ఎమ్మెల్యేలు చేరిపోడం ఖాయం అనుకోవచ్చు.
అయితే కాంగ్రెస్ లో చేరేందుకు అంత ఆసక్తి చూపించకపోయినా బీఆర్ఎస్ లో మాత్రం ఎవరూ యాక్టివ్ గా ఉండం లేదు. పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా సమావేశాలుకు హాజరవుతున్నారు కానీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. అంటే ఎన్నికల తర్వాత కుదిరితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అన్నట్లుగా జంప్ అవుతారని అర్థం చేసుకోవచ్చు.