అత్యంత సంచలనం సృష్టించిన నేరాలు తప్ప.. వైసీపీ నేతలందరిపై కేసులు మాఫీ అయిపోయాయి. నామినేషన్లు దాఖలుచేస్తున్న వైసీపీ అభ్యర్థుల అఫిడవిట్లు చూస్తున్న టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. దోపిడీలు, దొమ్మీలు వంటి కేసులు గతంలో ఉన్న నేతలు కూడా తమపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లు వేస్తున్నారు. అవినాష్ రెడ్డిపై ఒక్క వివేకా హత్య కేసులు మాత్రమే ఉన్నాయి. ఇతర కేసులు ఏమీ లేవు. గతంలో ఆయనపై ఐదారు కేసులు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ప్రభుత్వం ఉపసంహరించుకుందో ఎవరికీ తెలియదు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసుల ఉపసంహరణ ఓ ఉద్యమంలా సాగింది. కోర్టు కూడా చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డిపై కూడా సీబీఐ కేసులు తప్ప ఇతర కేసులన్నీ ఎత్తేస్తూ రహస్యంగా ఉత్తర్వులిచ్చారు. ఇది కోర్టు వరకూ వెళ్లింది. ఆయన కేసులు ఎత్తేసుకున్నారో లేదో అఫిడవిట్ లో తేలుతుంది. చాలా చోట్ల హత్య కేసుల్ని కూడా ఎత్తేశారు. గత అఫిడవిట్ లో తమ కేసుల గురించి చెప్పిన వారు.. ఈ సారి ఎందుకు తమపై కేసులు లేవని చెబుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ వచ్చిన తర్వాత టీడీపీ క్యాడర్ పై కేసుల విప్లవం నడిచింది. కొన్ని వేల కేసులు నమోదు చేశారు. చంద్రబాబుపైనే 24 కేసులు నమోదు చేశారు. లెక్కలేనంత మంది టీడీపీ క్యాడర్ పై కేసులు పెట్టారు. కానీ వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు లేకపోగా ఉన్న వాటిని ఎత్తేసుకున్నారు. క్రిమినల్ పాలనలోకి చట్టాలు, వ్యవస్థలు వెళ్తే ఎంత ప్రమాదకర పరిస్థితులు వస్తాయో… ఈ కేసుల ఉపసంహరణే సాక్ష్యంగా కనిపిస్తోంది.