బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లఘించారని ఫిర్యాదులు అందటంతో సుల్తాన్ బజార్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,290 రెడ్ విత్ 34సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో రాజాసింగ్ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలతో కలిసి రాజాసింగ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా గోషామహల్ హనుమాన్ వ్యాయమశాలలో నిర్వహించిన సభలో పాల్గొని రాత్రి 11గంటలకు ప్రసంగించారని , ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనేననే ఆరోపణలతో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.
పోలీసులు ఈ నెల 18నే కేసు నమోదు చేసినా విషయం ఆలస్యంగా వచ్చింది. అయితే, రాజాసింగ్ పై కేసు నమోదు చేయడాన్ని బీజేపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. ఎన్నికల నిబంధనల పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారంటూ మండిపడుతున్నారు. శ్రీరామ నవమి శోభా యాత్రను నిర్వహించినందుకు…హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ సర్కార్ ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రాజాసింగ్ పేర్కొన్నారు.