తెలంగాణా రాష్ట్రంలో వరుసపెట్టి జరుగుతున్న వివిధ ఎన్నికలలో అధికార తెరాస పార్టీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తుండటం, దాని చేతిలో ప్రతిపక్షాలు ఘోర పరాజయం పాలవుతుండటం ఇప్పుడు చాలా సర్వసాధారణమయిపోయింది. యుద్ధంలో గెలుపే ముఖ్యం తప్ప ఏవిధంగా గెలిచామన్నది ముఖ్యం కాదని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దాంతం. ఆ ప్రకారంగానే ఆయన ముందుకు వెళుతూ వరుస విజయాలు సాధిస్తున్నారు. అయితే ఈ వరుస విజయాల కోసం ఆయన అనుసరిస్తున్న విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించలేరు కానీ వాటికి కొమ్ములు తిరిగిన ప్రతిపక్షాలు కూడా తలవంచక తప్పడం లేదు. రాష్ట్రం నుండి ఇప్పటికే తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. దానితో జత కట్టిన భాజపాని కూడా కేసీఆర్ ఈపాటికి తుడిచిపెట్టేసేవారే కానీ కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉన్నందునేనేమో ఇంకా ఆయన ఉపేక్షిస్తున్నట్లున్నారు. తెదేపాతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూడా తుడిచిపెట్టేయాలని ఆయన చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కానీ అది ఇంకా నిలద్రొక్కుకొనే ఉందని తాజా ఫలితాలు తెలియజేస్తున్నాయి. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలలో తెదేపా, భాజపాలకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖమ్మంలో 6, వరంగల్లో 2 సీట్లు గెలుచుకోగలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకా తన ఉనికిని చాటుకొంటూనే ఉందన్నమాట. అయితే వచ్చే ఎన్నికల వరకు అది కేసీఆర్ ధాటిని తట్టుకొంటూ నిలబడగలిగినట్లయితే, తప్పకుండా అది మళ్ళీ లేచి నిలబడే అవకాశం ఉంటుంది. తెలంగాణాలో తెదేపా దుఖాణం దాదాపు ఖాళీ అయిపోయింది కనుక అది వచ్చే ఎన్నికల వరకు నిలబడగలదని ఆశించలేము. రాష్ట్రంలో నుండి తెదేపా మాయమయిపోతే అప్పుడు భాజపా ఒంటరి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందుకు అది చాలా కాలం క్రితమే సిద్దంగా ఉంది కానీ తెరాస ధాటిని తట్టుకొని అది రాష్ట్రంలో ఏవిధంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఏమి చేస్తుందో చూడాలి.