ఏపీలో వైసీపీ ప్రచార పర్వంలో పూర్తిగా వెనుకబడిపోయింది. ఎన్డీఏ కూటమి ఓ వైపు నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తూ.. దూసుకుపోతూంటే.. జగన్మోహన్ రెడ్డి రోజు మార్చిరోజు బస్సు యాత్ర పేరుతో స్కిట్స్ చేస్తున్నారు. వాటిని మీడియాలో సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేసుకుని అదే ప్రచారం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అందర్నీ దూరం చేసుకోవడంతో ఆయన కోసం ప్రచారం చేసే వారు ఎవరూ కనిపించడం లేదు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్, మోదీ ఇలా ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు. చంద్రబాబు రోజూ రెండు సభల్లో ప్రసంగిస్తున్నారు. పవన్ కల్యాణ్ జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా సభల్లో ప్రసంగిస్తున్నారు. బాలకృష్ణ రాయలసీమలో నిర్వహించిన ప్రచారం ఓ రేంజ్ లో సాగింది. కానీ వైసీపీ తరపున జగన్ బస్సు యాత్ర తప్ప ఏమీ సాగడం లేదు. ఆ బస్సు యాత్రను రోజుమార్చి రోజు ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.
నామినేషన్లు దాఖలు చేసే విషయంలోనూ వైసీపీ అభ్యర్థులు వెనుకబడిపోయారు. తొలి రోజు నుంచి టీడీపీ ఉత్సాహం చూపిస్తోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం.. భారీ జన సమీకరణకు తంటాలు పడుతున్నారు. ఎక్కడా భారీ జన సమీకరణ కనిపించడం లేదు. అతి కష్టం మీద అడ్డాకూలీల్ని తీసుకు వస్తున్నా.. పెద్దగా ప్రభావం కనిపిండం లేదు. చాలా చోట్ల అభ్యర్థులు ఖర్చు విషయంలో మిన్నకుండిపోతున్నారు. ప్రజల్లో ఉన్న ట్రెండ్ ప్రకారమే ప్రస్తుతం రాజకీయ సందడి కనిపిస్తోందన్న అభిప్రాయం సహజంగానే వినిపిస్తోంది.