ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ కు ధీటుగా అభివృద్ధి చేశామని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మెరికల్లాగా తీర్చిదిద్దామని ప్రచారం చేసుకుంది జగన్ సర్కార్. కానీ అదంతా డొల్ల అని తేలిపోయింది. సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతమే అందుకు నిదర్శనం.
విద్యా రంగంలో కీలకమైన బోధనా వ్యవహారాన్ని పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వం. ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బంది బాధ్యతలు అప్పగించింది.దీంతో ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కార్పోరేట్ విద్యకు పోటీ అంటూ ప్రచారం చేసుకున్న ప్రభుత్వ పాఠశాలలో కేవలం 79.38శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ పాఠశాలలో 96.72శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ స్థాయి విద్య అందుతుందని జగన్ చెప్తున్న మాటలు అంత ఉత్తదేనని స్పష్టమైంది.
తక్కువ మంది విద్యార్థులు ఉంటే రెసిడెన్షియల్, బీసీ సంక్షేమ మేనేజ్ మెంట్ పాఠశాలలో 98.43శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 2803 పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణులు కాగా అందులో 1988 ప్రైవేట్ పాఠశాలలే ఉండటం గమనార్హం. నాడు నేడు, విద్యార్థులకు ట్యాబులు అందించి ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నామని చెప్పుకున్నారు. స్కూల్స్ కు రంగులు మార్చడం తప్పితే విద్యా ప్రమాణాలను మెరుగు పరచడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని పదో ఫలితాలతో స్పష్టమైంది.
ప్రభుత్వ పాఠశాలలో నమోదైన ఉత్తీర్ణత చూసి ఇదేనా జగన్ రెడ్డి.. నువ్వు చెప్పిన కార్పోరేట్ విద్య ఫలితం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.