ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రాణం లాంటి పదవి పోయిన వివక్ష చూపకూడదు. కనీసం విపక్ష చూపించినట్లు కనిపించకూడదు. ఇంకా చెప్పాలంటే.. మాటల్లో అయినా అందరూ సమానమేనని చెప్పాలి. కానీ ప్రధాని మోదీ.. ముస్లింలను బూచిగా చూపెట్టి రాజకీయం చేస్తున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ముస్లింలను నిందిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే సంపద అంతా వారికి పంచి పెడతారని హెచ్చరిస్తున్నారు. ఒక సారి కాదు ఆయన పదే పదే అదే అంటున్నారు. ఆయన మాటలు ఎంత ఘోరంగా ఉంటున్నాయంటే.. మహిళల తాళిబొట్లు కూడా తెంపి ముస్లింలకు ఇచ్చేస్తారని చెబుతున్నారు మోదీ.
విద్వేషం పెంచకపోతే మోదీ గెలవలేరా ?
మోదీ ప్రచార వ్యూహంతో పాటు… ఇప్పటి వరకూ జరుగుతున్న వ్యవహారాలు చూస్తే.. బీజేపీకి ఊహించనంత గడ్డు పరిస్థితి ఉందని.. అందుకే ఆయన మళ్లీ పాత అస్త్రం బయటకు తీశారన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ మేనిఫెస్టోలోనూ సంక్షేమం గురించి.. అభివృద్ది గురంచి పెద్దగా దార్శనికత లేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి అంశాలను కీలకంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు కావడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో గత దశాబ్దాలుగా బిజెపి ఎన్నికల ప్రణాళికలలో కనిపించే ఈ అంశాలు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడలేదు. పదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్న ప్రశ్న ప్రజలకు వస్తోంది. దీనికి సమాధానం మోదీ వద్ద లేదు. కానీ అస్త్రం ఉంది. అదే ప్రయోగించారు.
సర్వేల్లో చూపిస్తున్నంత సానుకూలత లేదని నిరూపించిన మోదీ !
పదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ ఎన్నికల వేళ ముస్లిం వ్యతిరేకతను పెంచి.. దాన్నే రాజకీయం చేయడం ఏమిటనేది ఎవరికైనా డౌట్ వచ్చే అంశం. పదేళ్ల బీజేపీ హయాంలో దేశమంతా వెలిగిపోతుందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆ అభివృద్ధి నమూనాను ప్రస్తావించకుండా హిందూ- ముస్లిం అనే ఎజెండాతో బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. ముస్లిలపై వ్యతిరేకత పెంచడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అనుకుంటే కష్టమేనని ఇప్పటికే అనే రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి. కర్ణాటకలో 80 శాతం హిందువులు. 20 శాతం మైనారిటీలు. ఆ హిందువుల్లో కూడా ఎక్కువ మంది మత సంప్రదాయాలను ప్రగాఢంగా విశ్వసించి పాటించేవారు. అయినా… హిందువులకు తాను మాత్రమే టేకేదారునని చెప్పుకొనే బీజేపీకి అధికారం మిగలలేదు.
విశ్వగురు ఇంత చిన్న బుద్దితో ఉండరు కదా !
మోదీని విశ్వగురు అన్నట్లుగా ప్రచారం చేస్తారు వాట్సాప్ యూనివర్శిటీలు పెద్దలు . ఇంత కురచబద్దితో .. మామూలు గురువు కూడా ఉండరు. విశ్వగురు ఎలా ఉంటారు ? దేశంలో కాంగ్రెస్ పార్టీ డెభ్బై ఏళ్లు పరిపాలన చేసింది. ఎంత మంది ఆస్తులు మస్లింలకు పంచిపెట్టిందో మోదీ చెప్పగలరా ? ముస్లింలు అయినా వారూ భరతమాత బిడ్డలే. వారితో దేశప్రజలంతా కలిసి మెలిసి జీవిస్తున్నారు. కానీ గత ఇరవై ఏళ్ల నుంచి ఏర్పడిన విద్వేషం అంతకంతకూ పెరుగుతూ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఫలితంగా దేశం భూపరంగా విభజనకు గురికాకపోవచ్చు కానీ.. ప్రజల మధ్య ఆ విభజన రేఖ ఏర్పడుతోంది.
దేశ ప్రధానికి దేశానికి మంచి చేయాలి.. కుదరదు అనుకుంటే సైలెంట్ గా ఉండాలి.. కానీ చెడు చేయాలనుకోకూడదు. దురదృష్టవశాత్తూ మన రాజకీయ నేతలు.. దేశం మంటల్లో కాలిపోతూంటే… తాము రాజకీయంగా బలంగా ఉంటామన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇది ప్రజలు చేసుకున్న పాపం.