పతంజలి క్షమాపణలకు ససేమిరా అంటున్న సుప్రీంకోర్టు… పతంజలి ప్రమోటర్లపై మరోసారి మండిపడింది. కావాలనే తెలివిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు ఇస్తూ తమ ఉత్పత్తులను అమ్ముకున్నారన్న ఆరోపణలపై సాగుతున్న విచారణలో భాగంగా మరోసారి కోర్టు సీరియస్ అయ్యింది.
తమ ప్రకటనలపై క్షమాపణలు చెప్తూ బహిరంగ ప్రకటనతో పాటు ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చామని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు… మీరు మీ ఉత్పత్తులను అమ్ముకోవటానికి ఇచ్చిన ప్రకటన సైజులోనే, మీ క్షమాపణలు కూడా ప్రచురించారా? అని ప్రశ్నించింది.
తాము దేశవ్యాప్తంగా 67పత్రికల్లో 10లక్షలు ఖర్చు చేసి క్షమాపణ ప్రకటనలు ఇచ్చామని చెప్పగా… జస్టిస్ హిమా కోహ్లీ తీవ్రంగా స్పందించారు. క్షమాపణలు మెయిన్ పేజ్ లోనే ప్రచురించారా? ఉత్పత్తులను అమ్ముకునే ఫాంట్ లోనే క్షమాపణలు కూడా ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. దీంతో పతంజలి తరఫున వాదిస్తున్న ప్రముఖ లాయర్ ముకుల్ రోహ్గతీ… మరోసారి తాము క్షమాపణలు ప్రచురిస్తామని, పెద్ద సైజులో ప్రకటన ఇస్తామని కోర్టుకు చెప్పటంతో తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.